‘ఈసీ’ పారదర్శకతపై నీలినీడలు!

01-10-2026 | 05:05am

భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు గుండెకాయ అయితే, ఎ న్నికల కమిషన్ ఆ గుండె చప్పుడును కాపాడే రాజ్యాంగ సంస్థ. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలన్నది రాజకీయ పార్టీల నిర్ణయం కాదు, ప్రజల ఓటు నిర్ణయం. ఆ ఓటు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, భయభ్రాంతులు లేకుండా నమోదై, లెక్కించ బడేలా చూడటం ఎన్నికల కమిషన్(Indian Election Commission) బాధ్యత.

అలాంటి సంస్థపై రాజకీయ పక్షపాత ముద్ర పడితే అది ఒక అధికారి మీద విమర్శగా మిగలదు.. ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతపైనే ప్రశ్నగా మారుతుంది. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కాపలాదారు. అధికారంలో ఉన్న పార్టీకి అను కూలంగా వ్యవహరించే సంస్థగా కాకుం డా, ప్రతి ఓటరుకు సమాన దూరంలో నిలిచే స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థగా  కనిపించాలి.

అందుకే ఎన్నికల సంఘం తీసుకునే ప్రతి నిర్ణయం ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన చర్య లు, రాజకీయ పార్టీలకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా విశ్వాసాన్ని కలిగిం చేలా ఉండాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చుట్టూ తీవ్ర రాజకీయ, ప్రజాస్వామ్య చర్చ జరుగుతోంది. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం, మరణించినవారు, డూప్లికేట్ లేదా అనర్హులైన పేర్లను చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తొలగించడం తమ బాధ్యత అని ఎన్నికల సంఘం చెబుతోంది.

అదే సమయంలో, ‘సర్’ సంబంధించిన పేరు శోధన, నోటీసులకు పత్రాలు సమర్పించడం, అప్పీల్ వంటి సదుపాయాలను అధికారిక ఓటర్ సేవల పోర్టల్‌లో అందుబాటులో ఉంచిం ది. అయితే సమస్య అక్కడితో ముగియడం లేదు. ఓటర్ల పేర్ల తొలగింపు, పత్రా ల అవసరం, డేటా నిర్వహణ, సాఫ్ట్‌వేర్ ఆధారిత నిర్ణయాలు, ‘సర్’ అమలు విధా నం వంటి అంశాలపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు, న్యాయవాదులు, ప్రజాస్వా మ్య హక్కుల కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ప్రశ్నలకు సమగ్రంగా, ఆధా రాలతో సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్య త ఎన్నికల సంఘంపైనే ఉంది.

   ఇటీవల వెలువడిన ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదిక పలు అనుమానాలకు దారితీసింది. 2025 నవంబర్ నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు, సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్‌జోషి కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణ యాలు, ప్రక్రియలపై అధికారికంగా అ భ్యంతరాలు నమోదు చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. మహారాష్ట్రలో ‘సర్’ సందర్భంగా ఈసీఐ నెట్  సాఫ్ట్‌వేర్ పరిమి తులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మార్పులు కోరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. చట్టం ప్రకారం ఎన్నికల నమోదు అధికారులకు ఉన్న అధికారాలను సాఫ్ట్‌వేర్ పరిమితం చేయకూడద న్నది ఈ చర్చలో కీలకమైన అంశంగా మారింది.

ఫారం- మార్పులు, ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలు ఆ అభ్యంతరాల్లో ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈసీ మాత్రం ఇటు వంటి అభిప్రాయ భేదాలు సంస్థలో జరిగే సాధారణ చర్చా ప్రక్రియలో భాగమేనని, తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది. బీజేపీ కూడా ఇదే వాదనను ముందుకు తెచ్చింది. అంటే, కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయం స్పష్టం అయ్యింది. ఆ భిన్నాభిప్రాయాల వల్ల ఎన్నికల ప్రక్రియ చట్టబద్ధత దెబ్బతిన్నదని తేల్చడం మరో సంచలనంగా నిలిచింది. ఒక్కటి మా త్రం నిజం.. ఈ రెండింటినీ కలిపి చూడకూడదు.

అయితే ప్రజాస్వామ్యంలో అను మానం ఏర్పడటమే సమస్య కాదు.. ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి తగిన పారదర్శకత లేకపోవడమే అసలు సమ స్య. అందుకే రాజకీయ ఆరోపణలు మరిం త తీవ్రతరం అవుతున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను రాజకీయంగా సంస్థను బలహీనపరిచే ప్రయ త్నంగా కొట్టిపారేస్తోంది.

   భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను ఎన్నికల సంఘానికి అప్పగించింది. ఆ అధికారంతో పాటు ప్రజల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కూడా వస్తుంది. ఎన్నికల సంఘం స్వతంత్రత కేవలం చట్టపరమైన హోదాతోనే నిర్ధారించబడదు. నిర్ణయాలు ఎలా తీసుకున్నా రు? ఎవరు ఏ అభ్యంతరాలు వ్యక్తం చేశా రు? వాటిపై ఎలా స్పందించారు? ఓటరు పేరు ఎందుకు తొలగించారు? తిరిగి చేర్చుకునే అవకాశం ఏమిటి? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వగలిగినప్పుడే సంస్థాగత విశ్వసనీయత మరింత బలపడుతుంది.

ఓటరు పేరు తొలగించే పరిస్థితి ఏర్పడితే ముందస్తు సమాచారం, కారణం, అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం, అప్పీల్ చేసుకునే సమర్థవంతమైన మార్గం తప్పనిసరిగా ఉండాలి. అదే సమయంలో ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం పేరుతో ఒక్క అర్హుడైన ఓటరు హక్కు కూడా అన్యాయంగా కోల్పోకూడదు. ఈ విషయంలో ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవల్లో భాగంగా అధికారిక పోర్టల్‌లో ‘సర్’ జాబితాలో పేరు వెతకడం, నోటీసుకు పత్రాలు సమర్పించడం, దరఖాస్తు స్థితిని తెలుసుకోవడం, అప్పీల్ చేయడం, బీఎల్‌ఓ(బూత్ లెవల్ ఆఫీసర్)తో సంప్రదించడం వంటి సదుపాయా లు ఉన్నాయి.

కానీ డిజిటల్ వ్యవస్థలో పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దే మానవీయ, న్యాయపరమైన వ్యవస్థ కూడా సమర్థంగా పనిచేయాలి. అదేవిధంగా ఓట ర్ల జాబితాలో అక్రమ తొలగింపులు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తే, నియోజక వర్గాల వారీగా, ఆధారాలతో, నిర్దిష్ట కేసులతో ఆ విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. రాజకీయ విమర్శలు అవసరమే కానీ, అవి ఆధారాలపై నిలబడిన ప్పుడే ప్రజాస్వామ్య చర్చ బలపడుతుంది.

   ‘ఈసీ బీజేపీ జేబు సంస్థ’ అనే మాట విపక్షాల నోటినుంచి వస్తున్నా.. ప్రస్తుత రాజకీయ వివాదంలో ప్రతిపక్షాలు చేస్తు న్న తీవ్రమైన ఆరోపణల్లో నిజం ఎంత ఉంది? ఆ ఆరోపణ నిజమా.. కాదా? అన్నది రాజకీయ నినాదాలతో కాదు.. నిర్ణయాలు, డేటా, ప్రక్రియలు, న్యాయపర మైన పరిశీలనలతోనే తేలాలి. అయితే కేంద్రంలోని అధికార పార్టీకి కూడా ఇక్కడ ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. ఎన్నికల సం ఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయితే, దానిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయడానికి మరింత పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముం దుకు రాకూడదు? ఎన్నికల సంఘాన్ని రాజకీయంగా సమర్థించడం కంటే, ప్రతి అర్హుడైన ఓటరి పేరు సురక్షితంగా ఉందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేందుకు చర్య లు తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రయోజనాలకు మరింత ఉపయోగకరం.

అసలు ప్రశ్న ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్నది కాదు. ఓటరు తన ఓటు హక్కు సురక్షితంగా ఉందని నమ్ముతున్నాడా? అన్నదే. ఓటర్ల జాబితాపై నమ్మ కం కో ల్పోతే దాని ప్రభావం ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదు. మొత్తం ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతపైనే పడుతుంది. అం దుకే ‘సర్’ విషయంలో ఎన్నికల సంఘం ‘మమ్మల్ని నమ్మండి’ అనే స్థాయిని దాటి ‘ఇదిగో ప్రక్రియ.. ఇదిగో డేటా.. ఇదిగో నిర్ణయానికి కారణం.. ఇదిగో అప్పీల్ మా ర్గం’ అని ప్రజల ముందు స్పష్టంగా ఉంచాలి.

కమిషనర్ల మధ్య నమోదైన అభ్యంతరాలపై కూడా అవసరమైన వివరణలు ప్రజ లకు అందుబాటులో ఉండా లి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం బలం అధికార పార్టీ మద్దతులో లేదు, ప్రజల విశ్వాసంలో ఉంది. ఆ విశ్వాసం దెబ్బతినకుండా చూడ టం ఎన్నికల సంఘానిదే కాదు.. అధికార పార్టీ, ప్రతిపక్షాలు, పౌర సమాజం, మీడియా, న్యాయవ్యవస్థ అందరి బాధ్యత. ‘సర్’  కొనసాగా లా ? ఎలా కొనసాగాలి? అన్నదానిపై రాజకీయ భేదాలు ఉండవచ్చు. కానీ, ఒక విషయంలో మాత్రం భేదాభిప్రాయానికి తావు ఉండకూడదు. పారదర్శకత పేరుతో కేవలం ప్రకటనలు కాకుండా ఆచరణలోనూ పారదర్శకత కనిపించాలి. అదే రాజ్యాంగబద్ధ ప్రజాస్వా మ్యానికి నిజమైన పరీక్ష.

కేయూ జర్నలిజం శాఖ 

విభాగాధిపతి, 9866255355  

ప్రొ. సంగని మల్లేశ్వర్

మరిన్ని వార్తలు