చిన్నారెడ్డి బీఆర్‌ఎస్ కోవర్టు!
పదవుల కోసమే బ్లాక్‌మెయిల్
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్
గాంధీభవన్‌కు తరలివచ్చిన మేఘారెడ్డి వర్గీయులు
చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు మేఘారెడ్డి వర్గీయులు మంగళవారం గాంధీభవన్‌కు వచ్చి చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరగుతుందని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్‌ఎస్‌కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలను వెంట పెట్టుకుని సచివాలయం చుట్టూ తిరిగేది చిన్నారెడ్డేనని విమర్శించారు.
సచివాలయ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ఎవరు బీఆర్‌ఎస్, ఎవరు నిజమైన కాంగ్రెస్ పారీ కోసం పని చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని, పార్టీ నేతలను చిన్నారెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి మండిపడ్డారు.
తాను ఎమ్మెల్యే అయ్యేందుకు ఎవరికి డబ్బులిచ్చానో చిన్నారెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. గతంలో ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చిన ప్రతీ సారి ఇలాగే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? అని ఘాటుగా ప్రశ్నించారు. వనపర్తి నియోజకవర్గంలో తాను అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నానని తనపై అన్యాయంగా అసత్య ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. చిన్నారెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
ఏఐసీసీకి నివేదిక పంపుతాం : మహేశ్‌కుమార్ గౌడ్
ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదును పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించిన అనంతరం సమగ్ర నివేదికను ఏఐసీసీకి పంపిస్తానని తెలిపారు. సీనియర్ నాయకుడిగా చిన్నారెడ్డికి పార్టీ అన్ని విధాలా గౌరవం ఇచ్చిందని, భవిష్యత్తులోనూ అదే కొనసాగుతుందన్నారు. చిన్నారెడ్డికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను తెప్పించుకున్నామని, వాటిని కమిటీ పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని మహేష్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు.






