ఆ అంగడికి వెళ్తే.. ఫోన్ మాయం!

25-10-2026 | 11:10am

బోధన్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంగడిలో సెల్‌ఫోన్ల చోరీలు ఆగడం లేదు. కూరగాయలు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం వచ్చే ప్రజల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న దుండగులు చరవాణులను అపహరిస్తున్నారు. ప్రజలు కొనుగోళ్లలో నిమగ్నమై ఉన్న సమయంలో వారి ఏమరుపాటును అదునుగా తీసుకుని జేబుల్లోని ఫోన్లను చాకచక్యంగా కాజేస్తున్నారు. బాధితులు గుర్తించేలోపే అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. దీంతో ప్రతి ఆదివారం అంగడికి వచ్చే ప్రజలు సెల్‌ఫోన్ల చోరీలతో ఆందోళన చెందుతున్నారు.

రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా

బోధన్ పట్టణంలోని రైల్వే గేటు సమీపం నుంచి గోశాల రోడ్డు వరకు అంగడి జరిగే ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల చోరీలు అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రజల రద్దీ ఎక్కువగా ఉండటంతో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అంగడికి వచ్చే వారిని ముందుగానే గమనిస్తూ, అదును చూసి ఫోన్లను అపహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

వారానికి ఐదారు ఫోన్లు మాయం

బోధన్ మండలం మావంది ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆదివారం అంగడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తుండగా, ఆయన పైజేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అదేవిధంగా బోధన్ పట్టణానికి చెందిన మరో వ్యక్తి సుమారు 20 రోజుల క్రితం అంగడిలో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా, ఆయనకు తెలియకుండానే షర్టు పైజేబులోని సెల్‌ఫోన్‌ను దుండగుడు చోరీ చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ప్రతి వారం అంగడిలో ఐదు నుంచి ఆరు సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల అవగాహన.. అయినా తగ్గని చోరీలు

సెల్‌ఫోన్ల చోరీలను అరికట్టేందుకు పోలీసులు అంగడి ప్రాంతంలో నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రధాన కూడళ్లలోని స్తంభాలకు లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి, వివిధ భాషల్లో ‘దొంగలున్నారు.. జాగ్రత్త!’ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు కొనుగోళ్లలో నిమగ్నమై ఫోన్లపై సరైన దృష్టి పెట్టకపోవడంతో దొంగలకు అవకాశం లభిస్తోంది. చోరీకి గురైన ఫోన్ల వివరాలను బాధితుల ద్వారా సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌లో నమోదు చేయించి, వాటిని గుర్తించి తిరిగి బాధితులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా సుమారు 50 శాతం ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకటనారాయణ

ఈ విషయంపై బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ, అంగడికి సెల్‌ఫోన్ తీసుకెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైనంత వరకు అవసరం లేకపోతే ఫోన్లు తీసుకెళ్లకపోవడం మంచిదని, తప్పనిసరిగా తీసుకెళ్తే వాటిని భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు. చోరీల నివారణకు పోలీసుశాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

సెల్‌ఫోన్ చోరీ అయితే ఏం చేయాలి?

వీలైనంత వరకు అంగడికి సెల్‌ఫోన్ తీసుకెళ్లకుండా ఉండాలి. తప్పనిసరిగా తీసుకెళ్తే పైజేబుల్లో కాకుండా సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఫోన్ చోరీకి గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఫోన్‌లో యూపీఐ (UPI) యాప్‌లు ఉంటే బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపులను భద్రపరిచేందుకు సంబంధిత బ్యాంకు లేదా చెల్లింపు సేవా సంస్థను వెంటనే సంప్రదించాలి. అదే నంబర్‌తో కొత్త సిమ్‌ కార్డు తీసుకుని, చోరీకి గురైన ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయించాలి.ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరిస్తే అంగడిలో సెల్‌ఫోన్ల చోరీలను అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు