గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ నరసింహ
మఠంపల్లి సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకొని మఠంపల్లి మండలం మట్టపల్లి కృష్ణా నది వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ కె.నరసింహా(SP Narasimha) ఐపీఎస్ సంబంధిత పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
వారు మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు,భక్తులు, వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు,నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్,వాహనాల ప్రవేశం,నిష్క్రమణ మార్గాలను క్రమబద్ధీకరించాలని సూచించారు.నిమజ్జనానికి వచ్చే వాహనాలను నిర్ణీత మార్గాల్లోనే అనుమతిస్తూ,భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ను నియంత్రించాలని,కృష్ణా నది వద్ద నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని,నది పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భక్తులు నీటిలోకి వెళ్లకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని,ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జన ప్రదేశంలో బారికేడింగ్, లైటింగ్,భద్రతా సిబ్బంది, అత్యవసర సేవలు,వైద్య సహాయం,రక్షణ చర్యలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ తెలిపారు.వారి వెంట డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో హిమబిందు, ఎస్సై ప్రవీణ్ కుమార్, నరేష్, సర్పంచ్ విజయశాంతి అప్పారావు, ఆర్ఐ శివ స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.