మంత్రి సమీక్షలో విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మికార్ వినయ్ కుమార్
కామారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క(Minister Seethakka) నాలుగు జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క కామారెడ్డిలో విద్యాభివృద్ధి గురించి దృష్టి సారించాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కోతిమీర్ కార్ వినయ్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు.
స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు మంజూరు చేయించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1000 మందిపై విద్యార్థులు చదువుతుండగా కేవలం 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు బెంచీలు ఇతర మౌలిక వసతులు ఇబ్బందులు పడుతున్నారని, మంత్రి సీతక్క గుర్తించి వాటిని మంజూరు చేయాలని కోరారు. కళాశాల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సేన అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ కళాశాలకు ఇప్పటివరకు అవసరమైన నిధులు మంజూరు కాలేదని అన్నారు. కళాశాల అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఏటీసీ/ ఐటిఐ కళాశాల ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అవసరమైన భూమిని కామారెడ్డి పట్టణంలో కేటాయించి జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ ఎంసీఏ పీజీ కోర్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్య కోసం కామారెడ్డిలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని పీజీ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మంత్రి సీతక్క నిర్వహించే సమీక్షలో విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు కోతిమీర్కార్ వినయ్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు.