విజయవంతంగా బీసీ రాజ్యాధికార యాత్ర
రెండోరోజు కొనసాగిన టీఆర్పీ అధినేత మల్లన్న పాదయాత్ర
హైదరాబాద్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party)(టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ రెండో రోజు విజయవంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం ఈ పాదయాత్ర జియాగూడ నుంచి ప్రారంభమై ఆరాంఘర్, గగన్‌పహాడ్ మీదుగా శంషాబాద్(Shamshabad) వరకు కొనసాగింది. మల్లన్న వెంట పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్పీ అధినేత బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం ఆవశ్యకతను వారికి వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్మికులు(GHMC worker) తీన్మార్ మల్లన్నను కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీ వ్యవస్థల వల్ల తమ శ్రమ దోపిడీకి గురవుతోందని, రాత్రింబగళ్లు కష్టపడుతున్నా పనికి తగిన వేతనం అందడం లేదన్నారు. తక్షణమే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోయారు.
కార్మికుల కష్టాలను విన్న మల్లన్న వారి పక్షాన నిలబడుతానని, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయించే పూచి తనదని వారికి పూర్తి భరోసా ఇచ్చారు. కాగా మూడో రోజు శనివారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి పాలమాకుల, తిమ్మాపూర్ మీదుగా మల్లన్న యాత్ర సాగనుంది. కొత్తూరు, నందిగామ మండల ప్రధాన కూడళ్లలో బహిరంగ కార్నర్ మీటింగ్స్ ఉండనున్నాయి.శనివారం రాత్రికి నందిగామలోనే మల్లన్న బస చేయనున్నారు.