తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి తరానికి ఆదర్శం

11-09-2026 | 09:10pm

అమరజీవి అనుమాల లింగయ్య పార్టీకి చేసిన సేవలు అమోఘం

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్

గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట(Telangana Armed Peasant Struggle) చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని పొనుగోడు లో సిపిఐ మండల సమితి(CPI Mandal Committee) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 80వ వార్షికోత్సవ సభను పోరాట యోధుడు మాజీ సర్పంచ్ అను మూల లింగయ్య స్తూపం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1946–1951 మధ్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటం చారిత్రాత్మకమన్నారు. ప్రజలు గ్రామాలలో సంఘాలను ఏర్పాటు చేసుకొని ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు సాగారన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీది అని అన్నారు. 4000 మంది కమ్యూనిస్టులు ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. 3000 గ్రామాలలో స్వయంపాలన ఏర్పాటు చేసుకొని వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. పోరాటం ద్వారా పేదలకు భూములు పంచి, గ్రామాల్లో ప్రజా పాలనకు బాటలు వేశారని తెలిపారు. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి మతపరమైన పోరాటంగా చిత్రీకరించడం సరికాదన్నారు.అనుమాల లింగయ్య పార్టీకి చేసిన సేవలు కొనియాడారు. అనంతరం అమరవీరుల స్థూపాలు, పార్టీ దిమ్మెల వద్ద ఎర్రజెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, పోకల వెంకటేశ్వర్లు, కడియాల అప్పయ్య, త్రిపురం సుధాకర్‌రెడ్డి, బిల్లా కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు