6 September, 2026 | 9:50 AM

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు

06-09-2026 | 05:30am
  1. మన విద్యార్థులు దేశానికి దిక్చూచి కావాలి
  2. విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిద్దాం
  3. విద్యాభివృద్ధిలో 28 నుంచి 17వ స్థానానికి రాష్ట్రం
  4. పాలిటెక్నిక్ విద్యార్థులకు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్‌లోకి ప్రవేశం
  5. కొండగల్‌లో ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
  6. 123 మంది టీచర్లకు అవార్డులు ప్రదానం 
  7. పలు ప్రభుత్వ భవనాలకు ప్రారంభోత్సవం  

వికారాబాద్/కొడంగల్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని, తెలంగాణ విద్యార్థులు దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచేలా వారిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) పిలుపునిచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని (Birth Anniversary of Dr. Sarvepalli Radhakrishnan) పురస్కరించుకుని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ముందుగా ఉపాధ్యాయులతో  సీఎం గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సందర్శించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.యోగితారాణా, విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఫొటో ఎగ్జిబిషన్ విశేషాలను వివరించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి  నివాళు లర్పించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే అధికంగా ఉన్నారని, వారికి అత్యుత్తమ నాణ్యమైన విద్య అందించి రాష్ట్రానికి, దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయులను కోరారు. తల్లిదండ్రుల కంటే.. విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతారని, అందువల్ల వారి భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు.  

88 వేలు పెరిగిన విద్యార్థుల సంఖ్య

విద్యాభివృద్ధిలో తెలంగాణ గతంలో 28వ స్థానంలో ఉండగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17వ స్థానానికి చేరుకుందని  సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పురోగతి ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందని కొనియాడారు. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుంటే, తెలంగాణలో మాత్రం గత రెండేళ్లలో 88 వేలు పెరిగిందని వివరించారు. ‘ఈ విజయం మీది.. తెలంగాణ ప్రజలది’ అంటూ ఉపాధ్యాయుల కృషిని సీఎం ప్రశంసించారు.

‘ఉపాధ్యాయులు రోడ్డుపైకి రావొద్దు. వారి సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నా’ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 55 రోజుల్లో డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని గుర్తుచేశారు.

ఒక్క ఫిర్యాదు లేకుండా అత్యంత పారదర్శకంగా 25,950 మంది టీచర్ల పదోన్నతులు, 34,706 మంది ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టామని చెప్పారు. భార్య ఒకచోట, భర్త మరోచోట ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 317 జీవో సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కే. కేశవరావును సలహాదారుగా నియమించి విద్యాశాఖలోని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

పదేళ్ల పాలనలో రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు

గత ప్రభుత్వం  పదేళ్ల పాలనలో అనేక సమస్యలు సృష్టించి దాదాపు 8.11 లక్షల కోట్ల అప్పులు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మీ సర్వీస్‌ను 60 ఏళ్లకు పెంచిందని, ఆయన ఫామ్‌హౌస్‌లో పడుకుంటే.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రజాప్రభుత్వం 90 రోజుల్లో రూ.6వేల కోట్లు చెల్లించిందన్నారు. 

ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల చొప్పున బకాయిలు విడుదల చేసినట్లు తెలిపారు. ఏ రాష్ర్టంలోనైనా ప్రభుత్వ ఖర్చులతో ఉపాధ్యాయులను విదేశాలకు పంపి విద్యా విధానం అధ్యయనం చేయించారా? తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.  

నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి 

‘పీఆర్సీ ఇవ్వాలని శ్రీపాల్ అంటున్నాడు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి. ఆర్ధిక వెసులుబాటును బట్టి మీ సమస్యలు పరిష్కరిస్తా. టీచర్లు రోడ్డెక్కితే రాష్ట్రానికి శుభసూచకం కాదు. మీరు ఆశించినట్లుగా మీ సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికల పరీక్షలో ఎన్ని మార్కులు వేయాలో మీరే  నిర్ణయించుకోండి. మీ ఉద్యోగ సర్వీస్ 30 ఏళ్లు ఉంటుంది. మా సర్వీసు 5 సంవత్సరాలు,  మేము  ప్రతి 5 సంవత్సరాలకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.

రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి.. పదేళ్లు విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిద్దాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘నేనే మీ ప్రతినిధిగా సమస్యలను పరిష్కరిస్తా, డెడికేటెడ్‌గా విద్యార్థుల కోసం పనిచేయండి.. దేశ విద్యావ్యవస్థకు దిక్సూచిగా తెలంగాణను తీర్చిదిద్దుదాం’ అని సూచించారు. మనం చేస్తున్న మంచి పనులపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు.

ఉపాధ్యాయులకు గుర్తింపు ఇవ్వాలని, వారిని గౌరవించాలన్న ఉద్దేశంతోనే 123 మంది టీచర్లకు అవార్డులు అందజేశామని తెలిపారు.  దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సమర్థులైన వారిని విశ్వవిద్యాలయాల వీసీలుగా నియమించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు  కృతనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. 

‘పాలిటెక్నిక్’పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

పాలిటెక్నిక్ విద్య విషయంలో కొందరు బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని, అలాంటివారి ట్రాప్ లో పడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పాత విధానాన్ని కొనసాగిస్తూ,, పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులను నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి అనుమతిస్తామని చెప్పారు.

పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం అడ్మిషన్లు జరిగాయని, సాంకేతిక విద్యలో రాష్ట్రం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ‘నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు జ్ఞానం, భావ వక్తీకరణ నేర్చుకోవాలని,  నైపుణ్యం పెంపొందించుకోవాలని సీఎం పేర్కొన్నారు.

నైపుణ్యం ఉంటే జర్మనీ, జపాన్ దక్షిణ కొరియ వంటి విదేశాల్లో మంచి ఉపాధి పొందటానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనికోసం ఐటీఐలను ఏటీసీగా మార్చినట్లు చెప్పారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సమర్థులైన వారిని విశ్వవిద్యాలయాల వీసీలుగా నియమించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు  కృతనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. 

ప్రభుత్వ విధానాలతో విద్యాభివృద్ధి : మంత్రి రాజనర్సింహ

ప్రభుత్వం తీసుకుంటున్న పారదర్శకమైన విధానాల వల్ల తెలంగాణలో విద్యాభివృద్ధి మెరుగుపడిందని, ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. భారతదేశంలో మాతృదేవోభవ  పితృదేవోభవ  ఆచార్యదేవోభవ అనే గొప్ప సిద్ధాంతం ఉందన్నారు. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులు ఉపాధ్యాయులకు శుభకాంక్షలు తెలిపారు.

అనంతరం కొడంగల్ పట్టణ కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ అతిథిగృహం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి క్రిటికల్ కేర్ సంటర్, ప్రభుత్వ పాఠశాలల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ యోగిత రాణా, దేవసేన కమిషనర్, కళాశాల ప్రిన్సిపల్ సెక్రెటరీ అభిలాష అభినవ్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, స్థానిక మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, జిల్లా అధికారులు, ఉత్తమ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు