ఎల్ నినో భయోత్పాతం

19-09-2026 | 05:10am

సుంకవల్లి సత్తిరాజు :

ఆకాశాన్నంటే భవంతులు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నాయి. దిక్కులు పిక్కటిల్లేలా మోటారు వాహనాలు(Motor vehicles) శబ్ధం చేస్తున్నాయి. భూగర్భాన్ని చీల్చి అరుదైన ఖనిజ సంపద(Mineral wealth)ను వెలికితీస్తున్నాం. భూగర్భ జలాలను(Groundwater) విచ్చలవిడిగా తోడేస్తున్నాం. ప్రకృతికి పచ్చని ప్రాకారాలుగా నిలిచిన వనాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నాం. కాలుష్యం పెరిగిపోయిందని, వర్షాలు(Rains) పడడం లేదని ఏడుస్తున్నాం. కానీ, మన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ అసలు వాస్తవాలను మరుగున పడేస్తున్నాం. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ భూమండలం భగభగమంటోంది. ఎల్ నినో విజృంభించి వికట్టాటహాసం చేస్తోం ది. భూమధ్యరేఖకు సమీపంలోని ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. 

   భూమిని ఉత్తర,దక్షిణార్ధ గోళాలుగా విభజించే భూమధ్య రేఖ (ఈక్వేటర్) ఒక ఊహరేఖ. ఈక్వేటర్ సమీప ప్రాంతాల్లో సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదై భూమి త్వరగా వేడెక్కుతుంది. ఈక్వేటర్ ఫసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల గుండా వెళ్తుంది. ఇక్కడ సూర్య కిరణాలు నిటారుగా పడటంతో సముద్ర జలాలు త్వరగా వేడెక్కుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. ముఖ్యంగా ఫసిఫిక్ సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కాయి. ఈ కారణంగా ఎల్ నినో ఏర్పడింది.

ఎల్ నినో త్వరలో గాడ్జిల్లా ఎల్ నినో గా పరివర్తన చెందబోతుందని  ఇస్రో శావేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాలు లేక దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఇందుకు అతీతం కాదు. పలు ప్రాంతాల్లో వరి, వేరుశనగ వంటి పంటలు ఇప్పటికే వర్షాలు లేక ఎండిపోయాయి. చెట్లు కూడా నీరు లేక ఎండ వేడిమికి మాడిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే గోదావరి జిల్లాల్లో సైతం బోర్ల కింద పండించే పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.

ఎల్ నినో ప్రభావం వచ్చే ఏడాది కూడా కొన్ని నెలలు కొనసాగవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. టెక్నాలజీ  ఎంత డెవలప్ అయినా, ప్రకృతి అనేది అత్యంత బలీయమైనది. ప్రకృతిని కాదని మనం ఏమీ చేయలేం. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. భూమిని కాంక్రీటు కట్టడాలతో నింపే స్తున్నాం. చెట్లను నరికేస్తున్నాం. పచ్చదనానికి పాడె కడుతున్నాం. జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేస్తున్నాం. సముద్రాలను ప్లాస్టిక్ అవశేషాలతో నింపేస్తున్నాం. ఈ కారణంగానే ప్రకృతిలో అనేక అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. 

ఇక నైనా మేల్కొని గ్రీనరీకి ప్రాధాన్యమివ్వాలి. మానవ నివాసాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనానికి చిరునామాగా మార్చాలి. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ తగ్గుముఖం పడుతుంది. ప్రకృతి కరుణించి వర్షాలతో భూ మాత పులకరిస్తుంది.

ఎక్కడైతే పచ్చదనం పరిఢవిల్లుతుందో అక్కడ ప్రకృతి తన సమతుల్యతను కాపాడుకుంటుంది. పొలాలు కళకళలాడుతూ, అడవులు విస్తరిస్తూ, గ్రామాలు, పట్టణాలు హరితంతో పరవశిస్తే అక్కడ వర్షపాతానికి లోటుండదు. పుడమిపై పచ్చదనం తాండవించినప్పుడే ఎల్ నినోలు, సూపర్ ఎల్ నినోలు రుతుపవనాలకు అడ్డుకట్ట వేయలేవు. అందుకే ప్రకృతిని పరిరక్షించడం, పుడమిపై పచ్చ సంపదను ప్రతిష్ఠించడం మన ముందున్న మార్గం.  

 విశ్లేషకులు,

మోటివేషనల్ స్పీకర్, 9704903463

మరిన్ని వార్తలు