సినిమాల్లో తెలంగాణ బాణీ పెరగడం శుభపరిణామం!

13-09-2026 | 05:30am

‘ఇడుపుకాయితం’ సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి 

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఇడుపు కాయితం’(idupu kaayitham). బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి(Director Vamsi Reddy) దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ తెలంగాణ జానపద నృత్యకారిణి నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ‘శ్రీలత..’ సాంగ్ సంగీత ప్రియుల హృదయాలను హత్తుకుంటోంది.

ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు ఈ పాటకు దక్కుతున్న ఆదరణపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. “శ్రీలత..’ పాట మా ఫ్యామిలీ మెంబర్స్‌కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా స్పందన బాగా వస్తోంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు.

నేను తొలిసారి ఈ పాటలో నటించా. ఆ ఆలోచన బన్నీవాస్‌దే. నటించడం కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.. ఎంజాయ్ చేశా.  పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్‌గా తెలంగాణ ఫోక్ స్టైల్‌లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్‌గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశా. లిరిక్ రైటర్ అలరాజు ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి.

ఈ సినిమాలో ఆరు పాటలు, కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. నాకు పర్సనల్‌గా పాటలన్నీ సంతృప్తినిచ్చాయి. ప్రతి సినిమాకు సంతోషిస్తాం కానీ అందులో సందర్భానికి వచ్చే పాటలు కొన్నే ఉంటాయి. ఈ చిత్రంలో ప్రతి పాట సందర్భానికి తగినట్లు ఉంటుంది. మ్యూజిక్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రమిది. ఇది పూర్తిగా తెలంగాణ నేపథ్య సినిమానే అయితే మ్యూజికల్‌గా అందరికీ రీచ్ అయ్యేలా పాటల్లో కమర్షియల్ టచ్ ఇచ్చాం.

నేను గతంలో కొన్ని ఛానెల్స్ కోసం తెలంగాణ నేపథ్య సాంగ్స్ కంపోజ్ చేశా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాటలు రూపొందించా. ఇప్పుడు మన సినిమాల్లో తెలంగాణ బాణీ పెరగడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను ‘క్రేజీ కల్యాణం’, ‘దేత్తడి’, ‘తెల్లకాగితం’ వంటి చిత్రాలను మ్యూజిక్ చేస్తున్నా. వీటితో మరికొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి” అని చెప్పారు. 

నా బతుకు మార్చిన కాగితం ఇది: అలరాజు (గీత రచయిత)

గీత రచయిత అలరాజు మాట్లాడుతూ.. “నేను ఇప్పటిదాకా దాదాపు 40 చిత్రాలకు పాటలు రాశా. ‘మైల్స్ ఆఫ్ లవ్’ చిత్రంలోని ‘తెలియదే తెలియదే..’ పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. ఇటీవల వచ్చిన ‘బాపు’ సినిమాలో ‘కంగారే పడకురా..’ అనే పాట కూడా బాగా హిట్ అయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. తాజాగా ‘శ్రీలత’ పాట రిలీజ్ కాగానే కాసర్ల శ్యామ్ మెసేజ్ చేశారు. లిరిక్స్ చాలా గొప్పగా ఉన్నాయని అభినందించారు.

‘ఏ పంచాయితీ మన నడిమిట్ల వచ్చినా, మన మంచానికి అవి తెలియద్దే..’ అనే లైన్ ఆయనకు బాగా నచ్చింది. ‘ఇడుపుకాయితం అనే టైటిల్‌ను సాహిత్యంతో జస్టిఫై చేసేందుకు బాగా ప్రయత్నించావు’ అంటూ కాసర్ల శ్యామ్ ప్రశంసించారు. డైరెక్టర్ వంశీరెడ్డి కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి.. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలని చెప్పారు. హీరో, హీరోయిన్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది.

రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించా. టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్‌లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశా. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్‌పుట్స్ వల్ల కంఫర్ట్‌గా లిరిక్స్ రాశా. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘ఇడుపుకాయితం’ సినిమా.. గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటా” అని తెలిపారు.  

మరిన్ని వార్తలు