రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థది విశిష్టమైన పాత్ర: జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
జాతీయ జెండా ఆవిష్కరించిన జీఎం
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థకు విశిష్టమైన పాత్ర ఉందని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి(Enugu Rajeshwar Reddy) అన్నారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలు గురువారం స్థానిక జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించగా జీఎం ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆకాంక్షలు, హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనను అందించడం ప్రజాపాలన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో సంస్థ పురోగతికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని జీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం రామన్ వి పాఠక్, ఈ ఎం ఏజీఎం సాంబశివరావు, ఐఈడి ఏజీఎం జోతి, ఎఫ్ఏ డీజీఎం పి రాజేశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, ఎన్విరాన్ మెంట్ అధికారి టి పోషమల్లు, సీఎంఓఐ అద్యక్షులు నజీర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.