ఒకే గదిలో ఐదు తరగతులు
చదువు కోసం విద్యార్థుల పాట్లు
పిల్లర్ల దశలో ఆగిన నూతన భవన నిర్మాణం
త్వరగా పూర్తి చేయాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
ముస్తాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం ఎస్సి కాలనీలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎస్సి కాలనీలో 40 ఏండ్ల క్రితం అందుబాటులో ఉండాలని పాఠశాల భవనం నిర్మించారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం తరగతి గదులు సరిపోక 2002 అదనపు భవనం నిర్మించారు.క్రమ క్రమంగా పాత భవనం నాణ్యత కోల్పోయి శిథిలమవడం తో వర్షాకాలంలో పై పెచ్చులు ఊడి విద్యార్థులపై పడడం వలన తల్లిదండ్రులు భయం భయంగా తమ పిల్లలను బడికి పంపించారు. శిథిలమవుతున్న పాఠశాల భవనంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని వెంటనే పాత భవనం తీసేసి నూతన భవనం నిర్మించేందుకు మాజీ ఎంపీటీసీ కొండని బాలకిషన్ సహకారంతో సిఎస్‌ఆర్ నిధులు మంజూరు కావడం జరిగింది.
త్వరగానే కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టినా ఆర్థిక ఇబ్బందులతో పిల్లర్ల దశలోనే పనులు నిలిపివేశాడు. సకాలంలో భవన నిర్మాణం చేపట్టక అతని నిర్లక్ష్యం కారణంగా ఆ నిధులు ఇతర నిర్మాణాలకు మల్లించినట్లు బాలకిషన్ పేర్కొన్నారు. గత జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్(District Collector Sandeep Kumar) వ్యక్తిగత నిధులు మంజూరు చేసి పాఠశాల భవనం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంతలోనే బదిలీ పై వెళ్ళిపోయారు. ప్రస్తుతం పాఠశాల భవనం అసంపూర్తిగా నిలిచిపోయి విద్యార్థుల చదువుకు చాలా అంతరాయం ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం కావడం తో తరగతులు నిర్వహించేందుకు మరింత ఇబ్బందిగా ఉందని, వెంటనే సంబంధిత అధికారులు అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
భవనాన్ని త్వరగా నిర్మించాలి
ఒకే తరగతి గదిలో ఐదు తరగతుల విద్యార్థులు చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాఠ్యాంశాలు అర్ధం కాక చదువులో వెనుకబడే పరిస్థితి నెలకొంటుంది.నాయకులు అధికారులు వెంటనే ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి అసంపూర్తి నిర్మాణంలో ఉన్న నూతన భవనం పూర్తి చేసి త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. అదనపు తరగతి గదులు ఉంటేనే చెప్పడానికి ఉపాధ్యాయులకు,చదువుకోవడానికి విద్యార్థులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుంది.
- విద్యార్థిని మోక్ష శ్రీ
పేరెంట్ సర్వని శ్రీనివాస్