తుర్కపల్లి ఐటీ పార్క్‌ను త్వరగా అభివృద్ధి చేయాలి
కాలుష్యానికి కారణమవుతున్న టైర్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి
ఆలేరు, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తుర్కపల్లి మండలంలో సేకరించిన సుమారు 110 ఎకరాల భూమిలో ఐటీ పార్క్(IT Park)ను త్వరగా అభివృద్ధి చేసి ఐటీ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఐటీ పార్క్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్లే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు.
అలాగే ఆలేరు నియోజకవర్గంలోని కాటేపల్లి, బొమ్మలరామారం మండలం రంగపూర్ తదితర ప్రాంతాల్లోని టైర్ పరిశ్రమల కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలను తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీర్ల అయిలయ్య కోరారు.