ఇక జైలు భయం లేదు

13-09-2026 | 05:05am
  1. వ్యాపార చట్టాల్లో చిన్న ఉల్లంఘనలపై మినహాయింపు
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
  3. అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు(Business and industrial sectors) మరింత అనుకూల వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ వ్యాపార చట్టాల్లో ఉన్న చిన్నపాటి సాంకేతిక ఉల్లంఘనలను నేరపూరిత పరిధి నుంచి తొలగించేందుకు ఉద్దేశిం చిన తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ చట్టం బిల్లు(Telangana Public Trust (Amendment) Bill)కు శాసనసభ ఏకగ్రీవం గా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జన్ విశ్వాస్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఈ సంస్కరణలను చేపట్టినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) తెలిపారు.

బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. వ్యాపార రంగం(Business sector)లో చిన్నచిన్న సాంకేతిక లోపాలు(Technical glitches), నిబంధనల ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు నమోదు చేయడం వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులు అనవసరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి సుమారు 400 రకాల చిన్నపాటి సాంకేతిక నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగించడం ద్వారా వ్యాపారులకు ఊరట కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

చిన్నపాటి తప్పిదాలకు జైలు శిక్షలు, సుదీర్ఘ న్యాయ ప్రక్రియలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేకుండా చేయడం వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత మె రుగుపడటంతో పాటు కొత్త పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆ శాభావం వ్యక్తం చేశారు. వ్యాపార సంస్థలపై అనవసరమైన కేసులు, రెడ్ టేపిజాన్ని తగ్గించడంతో పాటు పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేలా ఈ సంస్కరణలు ఉంటాయని వివరించారు.

చట్టంలోని మార్పులపై కలెక్టర్లు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు త్వరలోనే సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చిన్న సాంకేతిక ఉల్లంఘనలను క్రిమినల్ కేసులుగా పరిగణించకుండా జరిమానాలు లేదా ఇతర తగిన చర్యల ద్వారా పరిష్కరించే విధానం తీసుకురావడం వల్ల వ్యాపారులు స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోందని, ఈ సంస్కరణలతో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వ్యాపార వాతావరణాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యమని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు