ఎస్ఆర్కె బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా 108 ప్రసాదాలు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండల కేంద్రంలోని జానపహాడ్ రోడ్డులో గల ఎస్ఆర్కె రెసిడెన్సీలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో(Ganpati Navratri celebrations) భాగంగా సోమవారం విగ్నేశ్వరుడికి మహా ప్రసాద నివేదన జరిగింది. విశ్వశాంతి, లోక కల్యాణం, కుటుంబ శ్రేయస్సు కోరుతూ అపార్ట్మెంట్ లోని మహిళలు స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన వివిధ రకాలైన ప్రసాదాలు లడ్డూలు, ఉండ్రాళ్లు, మోదకాలు, గారెలు, పులిహోర, దద్దోజనం, కేసరి, సేమియా పాశం, చక్ర పొంగలి తదితర వివిధ రకాల పిండి వంటలు, పండ్లు, పాయసాలను నిష్టతో తయారుచేసి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు.
వేద పండితులు ఇరువంటి శ్రీపాద శర్మ మొదట స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మహిళలు తెచ్చిన ప్రసాదాల తో స్వామివారికి నివేదన చేసిన అనంతరం భక్తులందరికీ పంపిణీ చేశారు.అంతకుముందు ప్రతిరోజు నిత్య పూజలు అందుకుంటున్న స్వామి వారికి ప్రముఖ వ్యాపారవేత్త రాచకొండ శ్రీనివాసరావు పావని దంపతులు సమర్పించిన మహా లడ్డు ప్రసాదాన్ని స్థానిక ప్రధాన కూడలిలోని రామాలయం నుండి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈనెల 23న స్వామివారికి వైభవంగా శోభాయాత్ర నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమైనారు.