గ్రామీణ క్రీడాకారులకు జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ అండ
రాష్ట్ర స్థాయి కబడ్డీకి ఎంపికైన 12 మందికి మూడేళ్లపాటు ఆర్థిక సహకారం
గరిడేపల్లి సెప్టెంబర్ 21,(విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని పేద, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పొనుగోడుకు చెందిన జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ (Jogu Pichireddy Foundation)ముందుకొచ్చింది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన 12 మంది క్రీడాకారులకు రానున్న మూడేళ్లపాటు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామని ఫౌండేషన్ కోశాధికారి జోగు అరవింద్‌రెడ్డి తెలిపారు.
ఇటీవల గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో అండర్-14, అండర్-17 విభాగాల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారిలో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారు. వీరిలో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారుల ఖర్చులను ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరిస్తామని అరవింద్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన క్రీడాకారులు అవకాశాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జోగు అరవింద్‌రెడ్డిని ఎంఈఓ పానుగోతు చత్రునాయక్, లోని వ్యాయామ ఉపాధ్యాయులు తో కలిసి ఘనంగా సన్మానించారు.