6 September, 2026 | 8:21 PM

నెరవేరని హామీలు...నిరాశలో ప్రభుత్వ ఉద్యోగులు

06-09-2026 | 06:40pm

కరీంనగర్ సిటీ, సెప్టెంబర్ 06 (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎన్నికల హామీలను ఒక్కటంటే ఒక్కటి తప్ప మిగతా హామీలన్నీ ఒక్కటి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్‌దారులకు నెరవేర్చలేదని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం(SC/ST Teachers' Association) జిల్లా అధ్యక్షులు మీసాల మల్లిక్(Mustache Mallick) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 1-7-2023 నుంచి ఇప్పటివరకు రావలసిన డీఏలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తానని పీఆర్సీ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మీరు ప్రభుత్వం ఏర్పరచి దాదాపు 32 నెలలు కావస్తున్నా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రావలసిన పూర్తి బకాయిలు అందలేదు.

మేము మా జీతం నుండి నెలనెలా దాచుకున్న జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ డబ్బులు ఇవ్వమంటే సంవత్సరాల నుండి సతాయిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ పార్ట్ ఫైనల్, లోన్ డబ్బులు రావడానికి కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పట్టేది. ఇప్పుడు కనీసం రెండేళ్లు పడుతుందని మీసాల మల్లిక్ ఆవేదన వ్యక్తం చేశారు.

మొదట్లో తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, కొన్ని రోజులు మాకు సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరితే, ఏడాది తరువాత డీఏ ఇస్తారని అనుకున్నామని, అలాగే మరో ఏడాదికి పీఆర్సీ ఇస్తారని అనుకుని అనుకొంటే దాదాపుగా 32 నెలలు గడిచినప్పటికీ డీఏలు ఇవ్వలేదని, కనీసం పీఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకోలేదని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను పట్టించుకున్న పాపాన పోలేదని మీసాల మల్లిక్ దుయ్యబట్టారు. 

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్‌దారులకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని, అన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో అన్ని రకాల చికిత్సలకు వైద్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుగు నెలల నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్‌దారుల నుండి డబ్బులు మాత్రం వసూలు చేస్తుందని, ఇంతవరకు ఏ ఒక్క ఉద్యోగి ఎంప్లాయ్ హెల్త్ కార్డు ద్వారా వైద్యం చేయించుకోలేదని అన్నారు.

ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ పరిస్థితి ఎలా ఉందంటే హాస్పిటల్స్ కట్టడానికి జాగా కొని, ఇప్పుడిప్పుడే హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నట్లే ఉంది తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వైద్యం చేసే ధోరణి కనబడుటలేదని మీసాల మల్లిక్ అన్నారు.

ఇప్పుడు ఇచ్చే హెల్త్ కార్డులలో చాలా తప్పులు ఉన్నాయని, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తుల విషయంలో భర్తకు హెల్త్ కార్డు వస్తే భార్యకు హెల్త్ కార్డు రావడం లేదని, అలాగే భార్యకు హెల్త్ కార్డు వస్తే భర్తకు రావడం లేదని వాపోయారు.

ఇప్పటికైనా ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తూ, ఎంప్లాయ్ హెల్త్ కార్డు విషయంలో అన్ని రకాల చికిత్సలకు అన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం అందించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మీసాల మల్లిక్ ప్రభుత్వాన్ని కోరారు.


మరిన్ని వార్తలు