యూపీఐ సామాన్యుడి ఆర్థిక మంత్రదండం
- ఎండీఆర్‌పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
- మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దూరదృష్టి, చొరవతో ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(Unified Payments Interface) (యూపీఐ) దేశంలో ఒక విప్లవాత్మక ఆర్థిక మంత్రదండంలా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) పేర్కొన్నారు. నాడు యూపీఐని ప్రవేశపెట్టినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివామని చెప్పుకునే చిదంబరం లాంటి కాంగ్రెస్ మేధావులు, రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్రంగా ఎగతాళి చేశారని గుర్తుచేశారు.
కానీ నేడు ఒక దశాబ్ద కాలంలోనే యాచకుడి నుంచి బిలియనీర్ వరకు అందరి చేతిలో యూపీఐ చేరి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక విప్లవంగా అవతరించిం దన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం డిజిటల్ లావాదేవీ(Digital transaction)ల్లో దాదాపు 50 శాతం ఒక్క భారతదేశం లోనే జరగడం గర్వకారణమని, నేడు 11 దేశాలు భారత యూపీఐ వ్యవస్థను అనుసరిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి అత్యున్నత సాంకేతిక వ్యవస్థను 24 గంటలపాటు నిరంతరాయంగా నడప డం వెనుక బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), సర్వర్లు, డాటా సెంటర్లు, టెలికాం నెట్‌వర్క్, అధునాతన ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.
ఈ ఉచిత సేవలను సామాన్యుడికి నిరంతరం అందించేందుకు ఏడాదికి కనీసం రూ. 20 వేల కోట్ల నిర్వహణ ఖర్చు అవుతోందన్నారు. ఇటీవల ప్రస్తావనకు వచ్చిన ఎండీఆర్(మర్చంట్ డిస్కోం ట్ రేట్) గురించి రాహుల్ గాంధీ, విపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మం డిపడ్డారు.
మోదీ గానీ, బీజేపీ గానీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజా సంక్షేమం, దేశ ఆర్థిక బలోపేతం,‘వికసిత్ భారత్ - అమృత్ కాల్ 2047’ లక్ష్యంగానే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రగతి రథాన్ని అడ్డుకునే సైంధవుల్లా ప్రతిపక్షాలు మారవద్దని, లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ హెచ్చరించారు. ఈ వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.