యువత భవితకు ఉత్తమ్ బాటలు
- కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సారథ్యంలో జాబ్‌మేళా
- 300కి పైగా కంపెనీలలో 3వేలకు పైగా ఉద్యోగావకాశాలు
- మేళాపై ఉమ్మడి నల్లగొండలో విస్తృత ప్రచారం
- ఈసారి ఖమ్మం జిల్లా అభ్యర్థులకూ అవకాశం
- నేడు కోదాడలో జోసెఫ్ సీసీ రెడ్డి మెమోరియల్ స్కూల్‌లో జాబ్‌మేళా
సూర్యాపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గ్రామీణ నిరుద్యోగ యువతకు(Unemployed rural youth) ఉపాధి ఆవకాశాలు(Employment opportunities) కల్పించాలన్న సంకల్పంతో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమారెడ్డి జాబ్ మేళా(Job Fair)కు మరోసారి శ్రీకారం చుట్టారు. తన సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్సినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(Singareni Collieries Company Limited), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్(Telangana Digital Employment Exchange) ల సహకా రంతో అక్టోబర్ 25, 2025లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసి సుమారు 3 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించారు. దానిని స్పూర్తిగా తీసుకుని తన రెండో కన్నుగా భావించే కోదాడ నియోజకవర్గంలో రెండోసారి జాబ్ మేళాకు తన శ్రీమతి, కోదాడ ఎమ్మెల్యే, జాబ్ మేళా చైర్ పర్సన్ ఉత్తమ్ పద్మావతి సారథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
300కు పైగా కంపెనీలతో జాబ్‌మేళా
నేడు కోదాడ పట్టణంలో జరుగనున్న మెగా జాబ్ మేళాలో 300కి పైగా వివిధ కంపెనీలు పాల్గొననున్నాయి. దీనిలో ఐఫోన్ తయారీ సంస్థ పాక్స్ కాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐ టి సి, ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎల్ అండ్ టి సంస్థలు, ఐటి, ఇంజనీరింగ్, ఫార్మసీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ లతో పాటు ఫార్మా రంగం నుండి డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ, దివి స్ లాబ్స్, అరబిందో ఫార్మా, హెటిరో, ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్, ఎంఆర్‌ఎఫ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్ కార్ట్, కొటక్ మహీంద్రా బ్యాంకింగ్, పేటీఎం వంటి అనేక కంపెనీలు ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు నుండి నాలుగు వేల మందికి ఉపాధి కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ ప్రత్యక్షంగా కంపెనీలతో మాట్లాడి ఈ మేళాను ఏర్పాటు చేశారు.
జాబ్ మేళాపై విస్తృత ప్రచారం
నేటి ఉదయం 8 గంటల నుండి నిర్వహించే ఉద్యోగ మేళాపై మంత్రి, జిల్లా కలెక్టర్ తేజస్ సందలాల్ పవార్, ఎస్పీ నరసింహ లతో పాటు జిల్లా అధికారులు విస్తృ త ప్రచారం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ లో, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లలో ఈ మేళాకు సంబంధించిన పోస్టర్ విడుదల. రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించడం, ఇతర ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జాబ్ మేళా గురించి విస్తృత ప్రచారం చేయడంతో ఎక్కువ మంది నిరుద్యోగ యువత హాజరుకానున్నారు.
కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి మెమోరియల్ పాఠశాలలో ఈ ఉద్యోగ మేళా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అలాగే హాజరయ్యే అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ లకు సైతం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వర్షంలో ఎటువంటి ఆటంకాలు లేకుం డా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేశారు.
అన్నీ తానై నడిచిన మంత్రి ఉత్తమ్
ఈ మేళాకు శ్రీకారం చుట్టింది మొదలు మంత్రి ఉత్తమ్ ప్రతి ఆంశం నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎక్కడ, ఎలా నిర్వహించాలనే విషయాలనుండి ఎక్కువ మంది హాజరయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరంగా చర్చిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులతో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులకు, ఔత్సాహికులకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న గ్రామ పరిపాలన అధికారులకు, కార్యదర్శులను మేళాను విజయవంతం చేయడంలో భాగస్వాములను చేశారు.
20వేల మందికి పైగా హాజరు
నేటి జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థుల రిజిస్ట్రేషన్ కోసం క్యూ ఆర్ కోడ్, kodadmegajobmela.com పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు 45 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిసింది. అలాగే ఒక్కో అభ్యర్థికి ఐదు కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించడంతో ఈ దఫా కూడా అధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరు అవుతారని సమాచారం. వెరసి ఈ జాబ్ మేళాకు 20 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
పాల్గొననున్న ప్రముఖులు వీరే..
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభు త్వం, స్వచ్ఛంద భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ జాబ్ మేళాను పరిశీలించేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై అభ్యర్థులు, కంపెనీల ప్రతినిధులతో ముఖముఖిగా పాల్గొననున్నారు.
గ్రామీణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ నిరుద్యోగ యువత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అన్ని రైతు కుటుంబాలే. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికైతే కొంత ఉపాధి అవకాశాలు ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. అందుకే రాజకీయాలకతీతంగా వారికి మంచి భవి ష్యత్తు అందించాలనే సంకల్పంతో గత సంవత్సరం హుజూర్ నగర్ పట్టణంలో జరిగిన మెగా జాబ్ మేళాను ఆదర్శంగా తీసుకొని ఈ మెగా ఉద్యోగమేళాను ఏర్పాటు చేశాం. ఆర్థికంగా బలపడితేనే ఎవరి జీవితాలైనా సంతోషంగా ఉంటాయి కావున ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
యువత భవితకు బంగారు బాటలు వేస్తున్నారు
యువత భవితకు బంగారు బాటలు పరిచేందుకు మంత్రి ఉత్తమ్ మరోసారి మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. గతంలో ఈ జిల్లాలో ఎవరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. గత సంవత్సరం హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా నిర్వహించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరోసారి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సారధ్యంలో 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అందుకే దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఇంత మంచి ఆలోచన చేసిన మంత్రికి ఎల్లప్పుడూ ప్రజల సహకారం ఖచ్చితంగా ఉంటుంది.
కందుల కోటేశ్వర్ రావు,
కోదాడ వాసి