ప్రజల అవసరాలే ప్రాధాన్యం
- ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనుల ఎంపిక
- ఎడగట్టలో VB-GRAMGపై అవగాహన గ్రామసభ
కోటపల్లి, అక్టోబర్ 2 ( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో VB-GRAMG పథకంపై( VB-GRAMG scheme ) గ్రామసభ ఉత్సాహంగా జరిగింది. సర్పంచ్ డోంగ్రీ రాజేశ్వరి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా వారి ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గ్రామ ప్రజల అవసరాలు, సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. VB-GRAMG పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల అవసరాల ఆధారంగా అత్యవసర పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సర్పంచ్ సూచించారు.
గ్రామ సామాజిక ఆరోగ్య కార్యకర్త సుంకే విజయలక్ష్మి బాలింతలు, గర్భిణీలు, రోగులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాత్కాలిక పనులకంటే గ్రామానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామసభలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుంకే శ్రీనివాస్,గ్రామ మహిళా సంఘం సిఏ జూమిడీ రాజేష్,అంగన్వాడి ఉపాధ్యాయురాలు జనగామ సువర్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ సికినం లక్ష్మణ్,వార్డు సభ్యులు, మహిళా సంఘం వివో సభ్యులు, మల్టీపర్పస్ వర్కర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.