విద్యాభివృద్ధిపై వీసీపీసీ సమీక్ష

08-09-2026 | 11:33pm

మల్దకల్:  జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) మల్దకల్ మండలం పెద్ద తాండ గ్రామంలోని ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో పెద్ద తాండ గ్రామంలో వీసీపీసీ ఆధ్వర్యంలో పిల్లల విద్యాభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని సర్పంచ్ నారియా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లల విద్యా పరిస్థితి, పాఠశాలల్లో వారి హాజరు, చదువుపై ఆసక్తి, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సర్పంచ్ నారియా నాయక్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడడంతో పాటు, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

గ్రామంలో విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తామని సర్పంచ్ తెలిపారు. పిల్లల విద్యకు గ్రామం మొత్తం అండగా నిలిస్తేనే మంచి ఫలితాలు సాధించగలమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్, గ్రామపంచాయతీ సెక్రటరీ, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొని పిల్లల విద్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామంలోని ప్రతి చిన్నారి చదువులో ముందంజలో ఉండేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు