జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి

05-10-2026 | 04:49pm

- కలెక్టర్‌ను కలిసిన వెంకటాపూర్ జర్నలిస్టులు

- సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్

వెంకటాపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని వెంకటాపూర్ జర్నలిస్టులు(Journalists ) జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు(Collector Borkade Hemant Sahadevrao)ను కోరారు. ఈ మేరకు సోమవారం ములుగు కలెక్టర్ కార్యాలయం(Mulugu Collector's Office)లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా మీడియా రంగంలో కొనసాగుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని, అయితే తమకు సొంత ఇళ్లు లేకపోవడంతో గత నాలుగేళ్లుగా మండలంలోని పాలంపేట గ్రామ శివారులోని రెవెన్యూ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని కలెక్టర్‌కు వివరించారు.

జర్నలిస్టుల సమస్యను విన్న కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఇంటి స్థలాల అంశంపై పూర్తి నివేదిక అందించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీకి కలెక్టర్ సూచించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌కు, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)కు జర్నలిస్టుల బృందం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సతీష్ యాదవ్, మురళీ, శివ, యోగి, హరీష్, ధర్మతేజ తదితర జర్నలిస్టులు ఉన్నారు.

మరిన్ని వార్తలు