పల్లె ప్రగతిని కాటేస్తున్న కాంగ్రెస్ కాలసర్పం
నిధులు నిల్ - అభివృద్ధి, సంక్షేమం కిల్
రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ఒట్టిబోయిన గ్రామాలు
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్, సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి శనిలా దాపురించిన తరువాత పల్లెల ప్రగతి(Rural progress)కి నిధులు నిల్, అభివృద్ధి, సంక్షేమం కిల్ అని బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(Jeevan Reddy) ధ్వజమెత్తారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి.. వేయి రోజులు గడుస్తున్నా అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మాక్లూర్ మండల కేంద్రంలో పల్లెల్లో విధ్వంసం.. పడకేసిన పారిశుధ్యం అనే అంశంపై నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కాలసర్పం పల్లె ప్రగతిని కాటేస్తోందని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ గ్రామాలు ఒట్టిబోతున్నట్లు ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందని ఇల్లు లేదు అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదం తాండవిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ ధనధాన్య రాశులతో నిత్యం సంక్రాంతి పండుగలా మెరిసిపోయాయన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో పల్లెలన్నీ ఒట్టిబోయి కళావిహీనమయ్యాయని విమర్శించారు.
రైతులు సాగునీటి జలాల పరవళ్లు చూసి చాలా రోజులైందన్నారు. చెరువులు ఎండిపోతున్నాయి. చేపలు చచ్చిపోతున్నాయి. రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు అందక, రైతు బీమా నిర్వీర్యమై, యూరియా దొరకక రైతు కుటుంబాలలో నిస్తేజం నెలకొంది. ఫలితంగా పల్లెలు మరింత వన్నె తగ్గి, గ్రామీణులంతా రేవంత్ రెడ్డి పోవాలి, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు నినదిస్తున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సాగిస్తున్న దగాకోరు పాలనతో తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు కుతంత్రాల ఆనవాళ్లు మళ్లీ దర్శనమిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నాడు చంద్రబాబు నిరంకుశ పాలనలో గ్రామాలలో దరిద్రం తాండవించిందన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ పల్లెలు పురోగతి సాధిస్తే, కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలకుల విధ్వంసకర విధానాలకు గ్రామాలన్నీ అభివృద్ధికి దూరమై బావురుమంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ శపథాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పనిలో ఉన్నాడని, అయితే అది ఆయన తరం కాదని చెప్పారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే మిషన్ భగీరథ స్కీమ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే కుతంత్రం జరుగుతోందని ఆరోపించారు. పల్లెల్లో కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడూ పోతుందో తెలియని స్థితి.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






