బ్రహ్మ సృష్టికి మూల పురుషుడే వినాయకుడు

13-09-2026 | 05:30am
  1. వినాయకుడే కొడుకుగా పుట్టాలని పార్వతీదేవీ తపస్సు!
  2. మొదటి మొక్కుల వాడి జననం వెనుక ఎన్నో కథలు!
  3. మట్టి గణపతుల ఆరాధనలో దాగున్న సమాజ శ్రేయస్సు
  4. పత్రి పూజల్లో నిగూఢమైన ఔషధగుణాలు
  5. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త లతా జంధ్యాల

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. జ్ఞానానికి, విజయానికి ప్రతీక. వినాయకచవితి అంటే ప్రతి ఇంట్లో పండగే. పూజలు, నైవేద్యాలు, వినాయకుడి ప్రతిష్ట, నిమజ్జనం.. ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం.. విశ్వాసం ఉంటాయి. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? వినాయకుడి ప్రతిమను ఎలా ప్రతిష్టించాలి? పూజలో పాటించాల్సిన నియమాలు.. ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అనే సందేహాలు కలగడం సహజమే. వాటిన్నింటికీ గల కారణాలు.. మరిన్ని  ఆసక్తికరమైన విషయాలు, వినాయక చవితి ప్రాశస్త్యంపై ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త లతా జంధ్యాల మాటల్లో తెలుసుకుందాం. 

వినాయకుడి జననం వెనక.. 

వినాయకుడు ఎవరు? ఎలా పుట్టాడు? అనే అంశాలపై పలు రకాల కథలు, కథనాలు ఉన్నాయి. వినాయక చవితి వ్రతకల్పంలో కూడా గణపతి ఆవిర్భావం గురించిన వివరాలు తెలిసినవే. పార్వతీదేవి నలుగు పెట్టుకోవడం, బాలుని బొమ్మ తయారు చేయడం, ద్వారం వద్ద కాపలాగా ఉన్న ఆ బాలుడి తలను శివుడు ఛేదించడం, ఆ తర్వాత ఏనుగు శిరస్సు తెప్పించి.. పునర్జన్మ ప్రసాదించడం.. ఇవన్నీ తెలిసినవే. దీంతోపాటు అసలు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది అని లతా జంధ్యాల పేర్కొన్నారు.  

విఘ్నేశ్వరుడి కోసం పార్వతీదేవీ తపస్సు!

బ్రహ్మ సృష్టి ఆరంభించే సమయంలోనే పార్వతీదేవి కూడా విఘ్నేశ్వరుడు గురించి తపస్సు చేసిందట. తనకు వినాయకుడు కొడుకుగా కావాలని కోరింది. వినాయకుడి కోసం వ్రతం చేసింది. ఈ వ్రతం శ్రావణమాసంలో శుక్ల చవితిన మొదలుపెట్టి భాద్రపదమాసంలో శుక్ల చవితి వరకు చేసినట్లు చెబుతుంటారు. ముఖ్యంగా సంతానం లేని వారు గనుక ఇది చేస్తే చక్కటి సంతానం వారికి కలుగుతుందని ఒక ప్రతీతి. ఇక పార్వతీదేవే గణపతి కావాలని వ్రతం చేయడం,

ఆయన వరమివ్వడం వల్ల వరద వినాయకుడు అయ్యాడని కూడా చెబుతుంటారు. అలాగే శుక్ల పక్షంలో వచ్చే చవితికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ రకంగా వినాయకుడు ఎప్పటి నుంచో ఉన్నాడని చెబుతుంటారు. మనం తలుచుకున్నప్పుడల్లా వివిధ రూపాలలో జన్మిస్తుంటాడని అంటుంటారు. బ్రహ్మ సృష్టిలో వినాయకుడి రూపమే మొదట కనిపించడం వల్ల అన్ని పూజల్లో ముందుగా వినాయకుడినే ఆరాధించాలనే సంప్రదాయం వచ్చిందంటారని లతా జంధ్యాల చెప్పుకొచ్చారు. 

చతుర్గుణాలు ప్రసాదించే గణేషుడు

వినాయకుడిలో నాలుగు గుణాలు ఉంటాయంటారు. ఆయన్ను పూజించిన వారికి జ్ఞానము, బలము, ఐశ్వర్యము, ఆనందము ప్రసాదిస్తాడని ప్రతీతి. అందుకే వినాయక చవితి రోజున పుస్తకాలు ఆయన పూజలో పెట్టడం ఆనవాయితీగా వస్తోందని లతా జంధ్యాల తెలిపారు.  

ఏనుగు తల వెనక..

వినాయకుడికి ఏనుగు తల వెనక కూడా ఒక చిన్న కథ ఉంది. బలవంతుల శక్తిని ఏనుగుతో పోలుస్తాం. ఏనుగు చాలా తెలివితేటలు కలిగిన జంతువు. విపరీతమైన బలం ఉంటుంది. ఇవి రెండు వినాయకుడిలో ఉన్నాయి. చెవులు పెద్దగా ఎందుకు ఉంటాయంటే.. ఎవరైనా ముఖ్యమైన విషయం చెబుతుంటే చెవులు పెద్దవి చేసుకుని వినాలంటుంటారు. ఆ విషయం ప్రజలకు అర్థం కావడానికే వినాయకుడి చెవులను పెద్దవిగా చూపిస్తుంటారు. 

మట్టి గణపతులే ప్రశస్త్యం

మట్టి గణపతిని పూజించాలని అందరూ అంటుంటారు. దాని వెనక ప్రకృతికి సంబంధించిన అంశాలు దాగున్నా.. శ్రాస్తీయంగా మరో కోణం ఉంది. మనం షట్ఛక్రాలు అంటుంటాం. వాటిలో మొదటిది మూలాధార చక్రం. అందులోనే వినాయకుడు ఉంటాడు.

ఈ చక్రానికి భూతత్వం ఉంటుంది. దీంతో వినాయకుడిని మట్టితో తయారు చేయడం శాస్త్రోక్తంగా శుభకరంగా భావిస్తుంటారు. ఇక రంగుల వినాయకులైతే నిమజ్జనం చేయడం వల్ల జలాశయాలు కలుషితమవుతాయనేది మరో వాదన అందరికీ తెలిసిందే. కావున సమాజ శ్రేయస్సుతోపాటు శాస్త్రీయ నమ్మకం ఆధారంగా మట్టి వినాయకులను పూజించడం అన్నివిధాలా శుభసూచికమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త లతా జంధ్యాల వివరించారు. 

వినాయక వ్రతంలో.. 

వ్రతంలో మామూలుగా ఆచరించే వాటిలో 21రకాల పత్రితో వినాయకుడిని పూజిస్తారు. ప్రధానంగా గరిక అంటే వినాయకుడికి ఎక్కువ ప్రీతి. గరిక వెనక కూడా ఒక కథ ఉంది. ఒక రాక్షసుడితో జరుగుతున్న యుద్ధంలో అగ్ని జ్వాలలతో ఉన్న రాక్షసుడిని వినాయకుడు మింగుతాడట. తర్వాత వినాయకుడికి కడుపులో మంట పుడుతుంది. దాంతో తనకు ఉపచారాలు చేయాలని వినాయకుడు కోరుతాడు. ఎన్ని ఉపచారాలు చేసిన మంట తగ్గదు.

చివరకు నైమిశారణ్యంలోని రుషులు ఒక్కొక్కరు రెండు, రెండు గరిక పోచలు తీసుకొచ్చి వినాయకుడికి సమర్పిస్తారట. అప్పటికి గానీ ఆయనకు రాక్షసుడిని మింగిన మంట చల్లారలేదంటారు. అందుకే స్వామివారికి గరికతో పూజ చేస్తే మనలో ఉన్న కోపతాపాలు తగ్గిపోతాయని చెబుతుంటారు. దాంతో ప్రజలు ప్రశాంత మనసు కలిగిన వారిగా ఉంటారని లతా జంద్యాల పేర్కొన్నారు. అలా స్వామి వారికి 21 రకాల పత్రులు సమర్పించడం వల్ల మనలో 21 రకాల దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం.

అంతేకాదు, సృష్టిలో 21 రకాల దుఃఖాలు, 21 రకాలు నరకాలు ఉన్నాయట. వీటన్నింటినీ దాటాలంటే వినాయకుడికి 21 పత్రులతో పూజిస్తారని చెబుతుంటారు. అంతేకాకుండా వీటిలో ఒక ఔషధగుణం కూడా దాగుతంది. భాద్రపద మాసంలో లభించే ఈ పత్రులను ఇంటిపై వేసుకుంటే పాజిటివ్ శక్తి ఉద్భవించి.. ఇంట్లో ఏమైనా చీడపీడలు ఉంటే తొలగిపోతాయని ఒక కథనం ఉందని లతా జంధ్యాల వివరించారు. 

సృష్టికి ముందే వినాయకుడి స్వ‘రూపం’ 

మనకు తెలిసిన ఒక వ్యక్తి పేరు చెప్పగానే అతడి రూపురేఖలు స్ఫురించడం సహజం. అలాగే వినాయకుడి జననం వెనుక కథలు ఎని ఉన్నా.. వినాయకుడు అనగానే ఏనుగు ముఖం గుర్తుకొస్తుంది. అందువల్లే గజాననుడు అని కూడా పిలుచుకుంటాం. ఇదంతా పక్కన పెడితే.. బ్రహ్మ దేవుడు సృష్టించడం మొదలుపెడదాం అనుకున్నప్పుడు ఆయనకు ఎలా అనేది అర్థం కాలేదట. ఏం చేయాలని ఆలోచిస్తున్న బ్రహ్మకు ఓంకారాన్ని మనసులో అనుకున్నాడట.

బ్రహ్మదేవుడు ఓం అని ఉచ్ఛరించగానే ఆయన నోట్లో ఒక తెల్లటి తేజస్సు బయటకు రావడం .. ఆ తేజస్సులో వినాయకుడు దర్శనం ఇచ్చాడట. ఇలా సృష్టిని మొదలుపెట్టాలనుకున్న బ్రహ్మకు కలిగిన ఆటంకాలను తొలగించిన ఆ రూపమే విఘ్నాలను తొలగించేవాడిగా, వినాయకుడిగా పిలుచుకుంటున్నాం. ఇంకా ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. లంబోదరుడు.. వక్రతుండుడు.. ఏకదంతుడు అని కొలుచుకుంటాం.

ఇదిలా ఉండగా, మాఘమాసంలో బహుళపక్ష చవితి తిధినాడు బ్రహ్మదేవుడికి ప్రణవాకారంలో గణపతిరూపంలో దర్శనం ఇచ్చాడట. సృష్టి ఆరంభానికి బ్రహ్మకు కలిగిన సంకటాలను, కష్టాలను తొలగించాడు కాబట్టి ప్రతీ మాసంలో సంకటహర చతుర్థి వస్తుందని శ్రాస్తాలు చెబుతున్నాయని ఆధ్యాత్మిక వేత్త లతా జంధ్యాల తెలిపారు.  

మరిన్ని వార్తలు