చట్టవిరుద్ధ నిర్బంధంలో వాంగ్‌చుక్
- సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి బులెటిన్‌లో తేడాలు
- ప్రైవేట్‌కు తరలించేలా అనుమతి ఇవ్వండి
- ఢిల్లీ హైకోర్టులో సోనమ్ భార్య గీతాంజలి ఆంగ్మో పిటిషన్
- ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం
- నేడు ‘చలో పార్లమెంట్’లో పాల్గొనండి
- ప్రజలకు ఆస్పత్రి నుంచి వాంగ్‌చుక్ పిలుపు
న్యూఢిల్లీ, జూలై 19: ప్రభుత్వ ఆధీనంలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో తన భర్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను చట్టవిరుద్ధ నిర్బంధం లో ఉంచారని గీతాంజలి ఆంగ్మో పిటిషన్ ఆరోపించారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారని, అక్కడ అందుతున్న చికిత్సపై తమకు నమ్మకం లేదన్నారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా, ఆయనను వైద్యులు, తమ న్యాయవాదులు స్వేచ్ఛగా కలిసేలా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఇది రెండో స్వాతంత్య్ర పోరాటమని, సోమవారం ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో భారీస్థాయిలో పాల్గొనాలని ప్రజలకు ఆస్పత్రి నుంచి వాంగ్‌చుక్ పిలుపు ఇచ్చారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలాని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగుచుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
అత్యవసరంగా తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకున్నది. ఈ సమయంలో శనివారం ఉదయం పోలీసులు ఆకస్మికంగా చర్యలు చేపట్టి సోనం వాంగ్‌చుక్‌ను అక్కడి నుంచి తరలించి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో భర్తను కలిసిన గీతాంజలి ఆంగ్మో, అక్కడ కూడా ఆయన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారని తెలిపారు. చికిత్స విషయంలో పారదర్శకత కనిపించడం లేదని ఆమె ఆరోపించారు.
వెంటనే ఆయనను డిశ్చార్జ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వాంగుచుక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని, అయితే డీహైడ్రేషన్ లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అలాగే వైద్య చికిత్సను స్వీకరించేందుకు ఆయన నిరాకరించినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిపై తాను పూర్తిగా విశ్వాసం కోల్పోయానని గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. తన సోషల్ మీడియా పోస్టులో ఆమె మాట్లాడుతూ, ‘సోనం వాంగుచుక్ శరీరంలోని పొటాషియం స్థాయి 2.9కు పడిపోయిందని, అది ప్రాణాపాయ స్థితి అని ఆసుపత్రి మాకు తెలిపింది. కానీ ప్రజలకు విడుదల చేసిన ఆరోగ్య బులెటిన్‌లో ఆ సంఖ్యను ప్రస్తావించకుండా, కేవలం ‘పొటాషియం స్థాయులు తగ్గుతున్నాయి’ అని పేర్కొన్నారు. మరోవైపు స్వతంత్ర ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షలో పొటాషియం స్థాయి 3.5గా నమోదైంది. ఇది సాధారణ పరిధిలోనే ఉందని తెలిపారు.
ఆస్పత్రిలో వంద మందికి పైగా పోలీసు సిబ్బంది
అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, వాంగ్‌చుక్‌ను డిశ్చార్జ్ చేయడానికి గానీ, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి గానీ అధికారులు అంగీకరించలేదని ఆమె ఆరోపించారు. ఆసుపత్రి ప్రాంగణంలో తమ సంచారంపై కూడా తీవ్ర ఆంక్షలు విధించారని తెలిపారు. వాంగుచుక్ చికిత్స పొందుతున్న అంతస్తులోనే సుమారు 30 మందితో సహా, మొత్తం వంద మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారని ఆమె పేర్కొన్నారు. ‘ఇది వైద్య సేవ కాదు... చట్టవిరుద్ధ నిర్బంధం. అందుకే సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత విషమించేలోపే ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అత్యవసర విచారణ కోసం పిటిషన్ దాఖలు చేశాను అని ఆమె తెలిపారు.
నేడు చలో పార్లమెంట్‌లో పాల్గొనండి
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తొలిసారిగా ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. జూలై 20న జరగనున్న ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిని ఆయన ‘భారత దేశపు రెండో స్వాతంత్య్ర పోరాటం’గా అభివర్ణించారు. అన్యాయం, భయం, పేపర్ లీకులు, అక్రమ నిర్బంధం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసనను విజయవంతం చేసి, న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.






