అసలేం జరుగుతోంది..?

22-09-2026 | 05:25am
  1. ప్రభుత్వ దవాఖానల్లో నుంచి ప్రైవేటుకు రిఫర్
  2. డ్యూటీ డాక్టర్ల రిఫరెన్స్..
  3. ప్రైవేటు అంబులెన్సుల హల్‌చల్
  4. నిరుపేద రోగులపై భారం
  5. జిల్లా అధికారులు విచారణ చేపట్టినా ఫలితం శూన్యం

బాన్సువాడ, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): పేదలకు ఉచిత వైద్యం(Free medical care) అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ప్రైవేట్ ఆసుపత్రుల రిఫరల్(Referral to private hospitals) వ్యవహారంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను కొందరు డ్యూటీ వైద్యులు(Doctors) అవసరమున్నా లేకున్నా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారన్న విమర్శలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ఆసుపత్రి పరిసరాల్లో ప్రైవేట్ అంబులెన్సులు(Private ambulances) పెద్ద సంఖ్యలో కనిపించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించే విషయంలో కొందరు అంబులెన్స్ నిర్వాహకుల పాత్రపై ఇప్పటికే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై ఆసుపత్రి అధికారులు విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని గతంలో వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.అయినప్పటికీ ఇప్పటివరకు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే పేద రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు, స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించాల్సి ఉంటుందని డ్యూటీ వైద్యులు చెప్పడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని వాపోతున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్న డాక్టర్లపై కూడా విచారణ చేయడం లేదని, కొంతమందిని ఆసుపత్రిలో బినామిలను నియమించుకొని ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక తరలించేలా వ్యవహారం కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అదనపు ఆర్థిక భారంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించే డాక్టర్లపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధిత రోగులు డిమాండ్ చేస్తున్నారు.

పేదల కోసం ఉన్న ఆసుపత్రి.. ప్రైవేట్కు ‘రెఫరల్ సెంటర్’గా మారుతోందా...?

ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ కారణంతో రోగిని రిఫర్ చేస్తున్నారు? నిజంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సాధ్యం కాదా? రిఫరల్కు ముందు అవసరమైన పరీక్షలు, వైద్య కారణాలు నమోదు చేస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలని ప్రజలు కోరుతున్నారు.

అంబులెన్సుల కదలికలపై నిఘా ఏదీ...

ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ అంబులెన్సుల సంచారం, రోగులను తరలించే విధానంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోగి కుటుంబ సభ్యుల సమ్మతి, రిఫరల్ కారణం, గమ్యస్థానం వంటి వివరాలు పారదర్శకంగా నమోదు చేస్తే అనుమానాలకు తావుండదని ప్రజలు పేర్కొంటున్నారు.

డ్యూటీ డాక్టర్ల రిఫర్లపై పలు ఆరోపణలు...?

బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు చికిత్స కోసం వచ్చే కొందరు రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్యం అందించాల్సిన సమయంలో రిఫర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి, రిఫర్ల వెనుక ఉన్న కారణాలను పరిశీలించి స్పష్టత ఇవ్వాలని రోగుల బంధువులు కోరుతున్నారు. రిఫర్ల ప్రక్రియపై పారదర్శకంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అధికారుల విచారణతోనే నిజాలు వెలుగులోకి వస్తాయా...?

ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్లు, అంబులెన్స్ల ద్వారా తరలింపులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? ఎవరి ప్రమేయం ఉంది? ఏమైనా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందా? అన్నది సమగ్ర విచారణతో తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం నిలబెట్టేందుకు అధికారులు పారదర్శకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు