కొయ్యగుట్ట గురుకులంలో అసలేం జరుగుతోంది?
- విద్యార్థినులకు అనారోగ్య సమస్యలు
- వారితోనే వంటపనుల నిర్వహణ!
- దుర్వాసనతో ఇబ్బందులు
- ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
- తనిఖీలు లేవు, పర్యవేక్షణ లేదు
- ఉన్నతాధికారుల మౌనం ఎందుకు?
బాన్సువాడ, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట గురుకుల పాఠశాలలో (Koyyagutta Residential School) విద్యార్థినులకు అందాల్సిన వసతులు, పారిశుద్ధ్యం, పాఠశాల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు కొందరు విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం, మరోవైపు విద్యార్థినులతోనే వంట పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
వంట పని చేస్తున్న విద్యార్థినులు
చదువుకోవాల్సిన విద్యార్థినులను పాఠశాల పరిధిలోని వంట పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? విద్యార్థినీలను ఏ పనులకు, ఎవరి ఆదేశాలతో వినియోగించారు?
అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థినులకు అందుతున్న వసతులు, పారిశుద్ధ్య పరిస్థితులు, భోజన నిర్వహణ, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థినులు చదువుపైనే దృష్టి సారించాల్సిన సమయంలో వసతుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న వార్తలు తమను కలవరపెడుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో వరుసగా సమస్యలు తలెత్తుతున్నప్పటికీ యాజమాన్యం తగిన స్థాయిలో స్పందించడం లేదని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత, పారిశుధ్యం, ఆహారం వంటి అంశాల్లో నిర్లక్ష్యం జరిగితే అది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణపై వస్తున్న ఆరోపణలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
గురుకులంలో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర తనిఖీ నిర్వహించి, విద్యార్థినీల భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, భోజన ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అపోహలు అయితే వాస్తవాలను అధికారికంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థినులతో పనులు చేయించలేదు
గురుకుల పాఠశాల విద్యార్థినులతో వంట పనులు చేయించడం లేదంటూ ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి మాట దాటవేశారు. కనులకు కట్టినట్టుగా విద్యార్థినులు పాఠశాలలో వంట పనులు చేస్తూ దిగిన ఫొటోలు ఉన్నప్పటికీ అలాంటిదేమీ లేదంటూ బుకాయించడం గమనార్హం.
ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి