దోమకొండ-ముత్యంపేట రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

23-09-2026 | 05:25am
  1. మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు 
  2. కంకర రోడ్డుతో ప్రయాణికుల అవస్థలు
  3. ప్రమాదాలకు కారణమవుతున్న రహదారి.. 
  4. పనులు వేగవంతం చేయాలని గ్రామ ప్రజల డిమాండ్

దోమకొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): దోమకొండ మండలంలోని(Domakonda Mandal) ముత్యంపేట రోడ్డు నిర్మాణ పనులు(Mutyampet road construction works) నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికుల కష్టాలు తప్పడం లేదు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో దోమకొండముత్యంపేట మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్(Gampa Govardhan) చొరవతో రోడ్లు భవనాల శాఖ(Roads and Buildings Department) ఆధ్వర్యంలో నర్సన్నపల్లి, క్యాసంపల్లి, రాఘవపూర్, ముత్యంపేట మీదుగా దోమకొండ వరకు సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని స్థానికులు తెలిపారు. పనులు ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

కంకర రోడ్డుతో అవస్థలు

ముత్యంపేట నుంచి దోమకొండ వైపు రహదారిపై కంకర వేసి వదిలేయడంతో ప్రస్తుతం కంకర తేలి రహదారిపై చెల్లాచెదురుగా మారిందని స్థానికులు తెలిపారు. గుంతలు, కంకర కారణంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, కొందరు ప్రమాదాలకు గురై గాయపడుతున్నారని పేర్కొన్నారు. వాహనాలు కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

ఆలయానికి వెళ్లే భక్తులకూ ఇబ్బందులు

ముత్యంపేటలోని ఎల్లమ్మ ఆలయానికి దోమకొండ మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అదేవిధంగా ముత్యంపేట మీదుగా కామారెడ్డికి వెళ్లే వారికి ఈ రహదారి ప్రధాన మార్గంగా ఉంది. దీంతో రోజూ పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గం అధ్వానంగా మారడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పనులు వెంటనే పూర్తి చేయాలి

రోడ్లు భవనాల శాఖ అధికారులు సమస్యను పరిశీలించి నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. పనులు ఎందుకు నిలిచిపోయాయి, ఇప్పటివరకు ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి అనే అంశాలపై అధికారులు సమీక్షించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే కొత్త కాంట్రాక్టర్తో పనులు చేపట్టి బీటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం పూర్తయితే దోమకొండ, ముత్యంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశారు 

కాంట్రాక్టర్ కామారెడ్డి నుండి ముత్యంపేట గ్రామం వరకు మాత్రమే పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారని మిగిలిన రహదారి పనులను పూర్తి చేయాలని ముత్యంపేట్ సర్పంచ్ అక్షర , జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినట్లు ఆశ బోయిన శ్రీనివాస్ పేర్కొన్నారు. రహదారి పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్  కోరారు.

- శ్రీనివాస్, ముత్యంపేట్, దోమకొండ మండలం

నిత్యం ప్రజల అవస్థలు 

ముత్యంపేట్ గ్రామం నుంచి దోమకొండ మండల కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజూ అనేక మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. రహదారిపై గుంతలు, కంకర తేలడంతో వాహనాలు దెబ్బతింటున్నాయని చింతమన్పల్లి సర్పంచ్ సిద్ధ రాములు తెలిపారు.

- సిద్ధి రాములు, సర్పంచ్, 

చింతమాను పల్లి, దోమకొండ మండలం

మరిన్ని వార్తలు