ఫీజు బకాయిలను ఎప్పుడిస్తారు?

13-09-2026 | 05:30am
  1. జీవో 97తో పాలిటెక్నిక్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు(Fee reimbursement arrears) రూ. 15 వేల కోట్లను ఎప్పుడు విడుదల చేస్తారో సీఎం స్పష్టత ఇవ్వాలని, జీవో 97తో పాలిటెక్నిక్ వ్యవస్థ(Polytechnic System)ను నాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(BJP State President Ramchander Rao) మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం విద్యార్థుల భవిష్యత్తుతో తీవ్రంగా చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ(BRS government) హయాంలో బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని అనడం పూర్తి అవాస్తవమని ఖండించారు. 2017 జనవరి 4న తాను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల స్కాలర్షిప్‌లు, విద్యావ్యవస్థ దుస్థితిపై గళమెత్తిన అంశాలు అసెంబ్లీ, మండలి రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి  హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బకాయిల సమస్య కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ తమ పదేళ్ల పాలనలో మొదటి ఎనిమిదేళ్లు నిధులు ఇచ్చి, చివరి రెండేళ్లలో దాదాపు రూ. 5 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే స్వయంగా బీఆర్‌ఎస్ నుంచి రూ. 5,430 కోట్ల బకాయిలు వచ్చాయని చెప్పిందని, 2024-25 నాటికి కాంగ్రెస్ హయాంలోనే మరో రూ. 6,037 కోట్ల బకాయిలు పెరిగాయని ప్రభుత్వమే వెల్లడించిందని వివరించారు. 2026 నాటికి పాత, కొత్త బకాయిలు అన్నీ కలిసి సుమారు రూ. 15 వేల కోట్లకు చేరుకున్నాయని మండిపడ్డారు.

విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేసే డీబీటీ విధానానికి బీజేపీ ఏనాడూ వ్యతిరేకం కాదని, మేనేజ్‌మెంట్ల్లతో తమకు సంబంధం లేదని, విద్యార్థుల ఖాతాల్లో ఆ సొమ్మును ఎప్పుడు జమ చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. బకాయిలు చెల్లించకపోవడం వల్లే అనేక కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ హయాంలో అక్రమాలు జరిగినా, కాంగ్రెస్ హయాంలో జరిగినా సమగ్ర విచారణ జరపాలని, కానీ విజిలెన్స్ దాడుల పేరుతో కాలేజీలను వేధించడం సరికాదని స్పష్టం చేశారు.

లాఠీచార్జ్ దుర్మార్గం..

సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని, తెలంగాణ విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. నూతన విద్యావిధానం తీసుకొస్తామని చెప్పి నియమించిన కమిటీ చైర్మనే రాజీనామా చేసి వెళ్లిపోయారని, ఆ కమిటీ విద్యాసంస్కరణల కోసం కాకుండా నక్సలిజం భావజాలం, నక్సలైట్లను తయారుచేసే దిశగా మారిందని మండిపడ్డారు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ సర్కార్ అంధకారంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో 97 ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేసి, పాలిటెక్నిక్ డిగ్రీనే పూర్తిగా ఎత్తేసే కుట్ర జరుగుతోందని, వారికి ఈ-సెట్ రాసే అర్హత ఉంటుందో లేదో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులతో క్రూరంగా లాఠీచార్జ్ చేయించడం అమానుషమన్నారు.

ఢిల్లీలో రాహుల్ గాంధీ ‘చాత్రోం కీ గూంజ్’ అని ఉపన్యాసాలు ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం లాఠీలతో విద్యార్థులను బాదుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి తెలంగాణ పరిస్థితులు తెలియజేస్తూ ఇంగ్లీషుతో పాటు ఆయనకు అర్థమయ్యేలా ఇటాలియన్ భాషలో కూడా లేఖ రాశామని, అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో నోరు మెదపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

లక్షలాది విద్యార్థుల తరఫున బీజేపీ పోరాటం..

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కార్యకర్తలు నేరుగా కాలేజీలకు వెళ్లి సుమారు 8 లక్షల మంది విద్యార్థుల నుంచి స్వయంగా సంతకాలు సేకరించారని స్పష్టం చేశారు. ఆ వినతిపత్రాలను ముఖ్యమంత్రికి అందించేందుకు సమయం కోరితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.

తాను ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 48 గంటల నిరాహార దీక్ష చేశానని, సెక్రటేరియట్ వద్దకు వెళ్లిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి, కేసులు పెట్టి తీవ్రంగా కొట్టడంతో చాలామంది ఆసుపత్రుల పాలయ్యారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని, ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు ఇవ్వలేకపోతే చేతులెత్తేస్తున్నామని ఒప్పుకోవాలని.. అప్పుడు ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వమే  విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ పూర్తిగా విడుదల చేస్తుందని స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఆయుష్ విద్యార్థులకు అండగా నిలిచి వారి స్టైపెండ్ పెరిగేలా ఎలాగైతే పోరాడామో, రాష్ట్రంలోని సమస్త విద్యార్థి లోకం పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని హెచ్చరించారు. 

బీజేపీలో చేరికలు..

మోదీ ఆలోచనలతో కూడిన ‘వికసిత భారత్’ నిర్మాణానికి, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై హైదరాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే సర్వీస్ నుంచి రిటైర్ అయిన డీసీపీ శ్రీనివాస్, సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు, పెద్దసంఖ్యలో యువకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని క్షేత్రస్థాయికి మరింత బలంగా తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు, బీజేపీ సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలతా రెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు