తనిఖీలప్పుడు పైరవీలు ఎందుకు?
- తూనికలు, కొలతల శాఖ అధికారి తీరుపై పలు ప్రశ్నలు...
- ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు..?
- తనిఖీలప్పుడు పైరవీలు ఎందుకు?
- రూ.10 వేల జరిమానా.. చివరకు రూ.5 వేలు!
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 27, (విజయక్రాంతి): పట్టణ మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ(Department of Legal Metrology) ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో చోటుచేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనిఖీల సందర్భంగా ఓ వ్యాపారికి కనీసం రూ.10 వేల జరిమానా విధిస్తామని అధికారి చెప్పినట్లు సమాచారం. ఆ సమాచారంతో ఓ వ్యక్తి పైరవీ చేసి ఫోన్ లో మాట్లాడిన తర్వాత అదే వ్యవహారంలో రూ.5 వేల జరిమానా మాత్రమే విధించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తనిఖీకి వచ్చారా ..పైరవీలకు లొంగ్యారా...
అమావాస్యకి.. పౌర్ణానికి తనిఖీలకు వస్తుంటారు తూనికలు కొలతల అధికారులు(Weights and Measures Officials). వచ్చిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం అధికారుల పని. పాల్వంచలో అందుకు విరుద్ధంగా తనిఖీలు చేపిచ్చేది, పైరవీలు చేసేది వ్యక్తిని ఎంతోకాలంగా ప్రచారంలో ఉంది. ఆ ప్రచారానికి ఆదివారం జరిగిన తనిఖీల పరిణామం ధృవపరుస్తోందని పట్టణంలో గుసగుస.
నిబంధనల ఉల్లంఘనకు(Violation of regulations) జరిమానా విధించే విషయంలో మొదట ఒక మొత్తం చెప్పి.. ఆ తర్వాత మరో మొత్తానికి తగ్గించడం పై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జరిమానా నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి? మొదట చెప్పిన రూ.10 వేల నుంచి రూ.5 వేలకు జరిమానా ఎందుకు తగ్గింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా జరిమానా విషయంలో మార్పు చోటుచేసుకునే ముందు అధికారితో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆయనకు, సదరు వ్యాపారికి లేదా ఈ వ్యవహారానికి ఉన్న సంబంధం ఏమిటి? ఫోన్ సంభాషణ అనంతరం జరిమానా మొత్తం ఎందుకు మారింది? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.