కోడళ్ల ముచ్చట తీరేనా?
వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి
కరీంనగర్, సెసెప్టెంబర్ 18 (విజయ క్రాంతి) : కరీంనగర్(Karimnagar) ఉమ్మడి జిల్లాలో రాజకీయ వారసత్వం(Political Legacy) కొత్తేమి కాదు.. అయితే ఈసారి ఆయా పార్టీల నేతల కోడళ్ళు ముందుకు వస్తున్నారు. డిలిమిటేషన్(Delimitation), చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు(Implementation of reservations)లోకి వస్తాయన్న ఆశతో నేతల కోడళ్లు 2028 ఎన్నిక(Election)ల్లో పోటీకి సై అంటున్నారు. ఇప్పటి నుండే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీనియర్ నాయకుడు మాజీ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు కోడలు, ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు, బిజెపి నేత ఈటల రాజేందర్, జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోడళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కోడలు డాక్టర్ చెన్నమనేని వికాసరావు భార్య డాక్టర్ దీప భర్తతో కలిసి వేములవాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ప్రతిమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ మహిళ రిజర్వు అయితే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈటల రాజేందర్ కోడలు ఈటల క్షమిత రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొన్నారు. వృత్తిపరంగా ఇంజనీర్, వ్యాపారవేత్తగా వివిధ సంస్థలలో డైరెక్టర్/కో-ఫౌండర్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నుండి కోడలును బరిలో దించాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది.
చరిష్మా రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల రాజకీయాల్లో ప్రముఖుడైన, బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి తన చిన్న కోడలు చరిష్మా రెడ్డి ని ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆమె రాజకీయ ప్రవేశం ద్వారా జగిత్యాల రాజకీయ పరిణామాలకు సంబంధించి వార్తల్లో నిలిచారు. చరిష్మా రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించడంతో, రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతుంది. దాసరి మనోహర్ రెడ్డి తన కోడలు పెద్దపల్లి మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతను బరిలో దించాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ నలుగిరు తెరమీదికి వస్తే ప్రజలు ఆదరిస్తారా చూడాలి.