కారుకొండ రామవరం బౌద్ధ గుహల వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం
లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరం బౌద్ధ గుహల వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం(World Tourism Day)–2026 వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో, జిల్లా పర్యాటక నోడల్ అధికారి బి. అనూష(District Tourism Nodal Officer B. Anusha) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) డి ఆర్ డి ఓ ఎం. విద్యా చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కారుకొండ రామవరం సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు లక్ష్మీదేవిపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధ్యతాయుతమైన పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సుస్థిర పర్యాటకం ప్రాధాన్యతను ప్రధానంగా వివరించారు. కారుకొండ రామవరం బౌద్ధ గుహలు, అక్కడి బౌద్ధ సాంస్కృతిక నిర్మాణాల చారిత్రక ప్రాధాన్యత, వాటి పరిరక్షణ ఆవశ్యకతపై బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు అవగాహన కల్పించారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విద్యార్థులలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణహిత జీవన విధానం మరియు బాధ్యతాయుత ప్రవర్తనపై అవగాహన కల్పించేలా స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను కాపాడుతూ, పరిశుభ్రతను పాటిస్తూ, స్థానిక సమాజ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.