800 ఏళ్ల బాలగణేశుడు
ఆదిలాబాద్‌లో అరుదైన విగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చందా, శివారం గ్రామాల మధ్య సా.శ. 12 వ శతాబ్దికి చెందిన బాల గణేశ్ విగ్రహాన్ని, స్థానిక చరిత్ర ఉపాధ్యాయులు పృథ్వీరాజ్ రొడ్డావార్ గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర (History of Telangana) బృందం అధ్యక్షుడు శ్రీ రామోజు హరగోపాల్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
చందా గ్రామ శివారు రైలు కట్ట సమీపంలోని ఒక చెట్టు కింద గల ఒక శిల్పంలో ఒక పీఠంపై సుఖాసనంలో కూర్చున్న పార్వతి, కుడి చేతిలో ఒక ఫలాన్ని, ఎడమ చేతితో తన ఎడమ తొడపై, కూర్చొని చనుబాలు తాగుతున్న బాల గణేశుని పట్టుకొని ఉందని, ఈ శిల్పం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు వెలుగు చూసిన తొలి, అరుదైన చారిత్రక ప్రాధాన్యత గల శిల్పమని వారన్నారు.
బాలగణేశునికి రెండు చేతులేవుండి, తలపై కిరీటం లేకపోవడం గమనించాల్సిన విషయమన్నారు. ఆదిలాబాద్‌కు 14 కిలోమీటర్ల దూరంలో సా.శ.1104 లో మాల్వా దేశ రాజకుమారుడైన పారమార జగదేవుడు జైనథ్‌లో నిర్మించిన లక్ష్మీనరసింహాలయ శిల్పాలను పోలిన ఈ బాలగణేష్ శిల్పం సా.శ. 12వ శతాబ్దికి చెందిందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శిల్పాన్ని గ్రామపంచాయతీకి తరలించి, భద్రపరచాలని హరగోపాల్, శివనాగిరెడ్డి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.