బాబోయ్... గుప్పుమంటున్న నాటుసారా!

18-09-2026 | 08:44am

నాటుసారాకు బలవుతున్న యువత, మధ్య వయస్కులు, సైతం

చిన్న వయసులోనే వితంతువులవుతున్న యువతులు

సారా.. అంబర్.. పాన్‌ పరాగ్‌ — డ్రగ్స్, గంజాయి, యువత జీవితాలతో చెలగాటం.

ఎక్సైజ్ శాఖ... తనిఖీలు తూతూమంత్రమేనా..?

తుంగతుర్తి, (విజయక్రాంతి): బాబోయ్ పండుగలు వస్తున్నాయంటే... పల్లెల్లో నాటుసారా జోరు పెరుగుతోందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాలు, తండాల్లో కొన్నిచోట్ల ఉదయం నాలుగు గంటల నుంచే సారా విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు జోరుగా ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి(Thungathurthy constituency) మూడు జిల్లాలు ప్రక్క, ప్రక్కనే ఆనుకొని ఉండటం వల్ల, ఒకపక్క బెల్లం, పట్టిక వ్యాపారాలు, మధ్య రాత్రి వేళల్లో జోరుగా సాగుతున్నది.  దీనితో కొంతమంది సారాకు అలవాటు పడి, వాళ్లు తాగుతూ, ఇంకొంత ఇండ్లలోనే సారాయి, తయారీ, వ్యాపారం జోరుగా సాగుతున్నది. మండల కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో, మూలిగేనక్కపై, తాటిపండు పడ్డడు చందంగా మారింది. మద్యం మత్తుకు యువత బానిసలుగా, మారుతుండటం తో కుటుంబాల్లో ఆందోళన నెలకొంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యువత జీవితాలపై... తీవ్ర ప్రభావం.

చిన్న వయసులోనే మద్యం, నాటు సారాకు అలవాటు పడుతున్న యువతలో కొందరు ఆరోగ్య సమస్యలతో, ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం వినియోగం కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో పాటు భార్యాభర్తల మధ్య, విభేదాలు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని అంటున్నారు. కొన్ని కుటుంబాల్లో యువకులు మృత్యువాత పడటంతో వారి భార్యలు చిన్న వయసులోనే వితంతువులుగా మారుతున్న, విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. గడిచిన రెండు సంవత్సర కాలంలోనే, ఒక ప్రక్క ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు, సాధారణ వ్యక్తులు కూడా, పండుగల పేరుతో మద్యం సేవించి, రాత్రి వేళల్లో వాహనాలు నడుపుతూ సైతం తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.

సారా ఒక్కటే కాదు.. పొగాకు, గంజాయి, డ్రగ్స్ ఉత్పత్తులూ ప్రమాదమే.

నాటు సారాతో పాటు అంబర్‌, పాన్‌ పరాగ్‌ తదితర పొగాకు, గంజాయి, డ్రగ్స్ ఉత్పత్తులను నమలడం యువతలో అలవాటుగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం నోటి క్యాన్సర్‌ సహా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. గంజాయి డగ్స్ కు అలవాటు పడి, డబ్బుల కోసం, ప్రాణాలు సైతం తీస్తున్న సంఘటన కోకోలలుగా సమాజంలో మారింది.

తెల్లవారితే గ్రామాల్లో... మద్యం కోసం మద్యం ప్రియులు.

కొన్ని గ్రామాలు, తండాల్లో తెల్లవారుజామునే సారా విక్రయాలు ప్రారంభమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులకు వెళ్లాల్సిన యువకులు, సైతం ఉదయాన్నే మద్యం సేవిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో పని సామర్థ్యం తగ్గడం, కుటుంబ ఆదాయంపై ప్రభావం పడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూతూ మంత్రంగా.... ఎక్సైజ్ శాఖ తనిఖీలు.

నాటుసారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు(Excise Department officials) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అవి “తూతూమంత్రంగానే ఉంటున్నాయంటూ” కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ సభ్యులు పరిధిలో కొన్ని కేసులు జరిగినప్పటికీ, అవి కనీసం మీడియా దృష్టికి రాకుండా చేసుకోవడం గమనార్వం. కొందరు అధికారులు అమ్యామ్యాలకు లొంగి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. శాఖలో కొంత మంది వ్యక్తులు, రైడింగ్ కి వస్తున్నామని ముందస్తుగానే తెలియజేయడంతో, ఇంటికి పోయేసరికి ఏమీ లేకుండా కనబడుతున్నాయని, వారికి వారే గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, పర్యవేక్షణ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది.

యువతను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది..?

పల్లెల్లో నాటుసారా, అక్రమ మద్యం, పొగాకు ఉత్పత్తుల, గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్‌, పోలీస్‌, వైద్య, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, తల్లిదండ్రులు సైతం, తమ పిల్లలను అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. పట్టపగలు సాగుతున్న, అక్రమ విక్రయాలపై ,నిరంతర నిఘా పెట్టాలని, స్థానిక ప్రజలు, వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు