పుష్‌పుల్‌లో అక్రమ రవాణా!?
- బెల్లం రవాణాకు కొత్త దారులు
- విజయవాడ టూ మహబూబాబాద్
- గుడుంబా తయారీ దారుల కొత్త ఎత్తులు
మహబూబాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): గుడుంబా నిర్మూలన కోసం మానుకోట పోలీసులు(Manukota Police) ఎంత కట్టడి చేసినా.. గుడుంబా తయారీదారులు(Illicit liquor manufacturers) పోలీసుల ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. గుడుంబా తయారీలో ప్రధానంగా వినియోగించే తెలంగాణలో నిషేధిత నల్ల బెల్లం(Banned black jaggery), పటిక అక్రమ రవాణా(Illegal transport of alum)కు నిరంతరం నిఘా పెడుతున్నప్పటికీ కొత్త కొత్త మార్గాల్లో నల్ల బెల్లం పటిక దిగుమతి చేస్తున్నారు. రోడ్డు మార్గాన ఆంధ్ర నుండి నల్ల బెల్లం, పటిక రవాణా చేస్తుంటే పోలీసులు పట్టుకుంటున్నారని, రైలు మార్గాన రవాణా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
విజయవాడ(Vijayawada) నుండి సాయంత్రం పూట కాజీపేటకు వచ్చే పుష్పుల్ రైలు ద్వారా నల్ల బెల్లం, పటిక రవాణాకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రైలు విజయవాడలో సాయంత్రం బయలుదేరుతుండగా రాత్రి 10 దాటిన తర్వాత డోర్నకల్, గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, కేసముద్రం స్టేషన్కు చేరుతుంది. విజయవాడలో జీ ఆర్ పీ, ఆర్ పీ ఎఫ్ పోలీసుల కళ్ళు కప్పి బస్తాల్లో బెల్లం, పటిక తక్కువ ధరకు కొనుగోలు చేసి అనుమానం రాకుండా ప్రత్యేకంగా ప్యాక్ చేసుకుని ప్రయాణికుల మాదిరిగానే రైలు బోగిల్లోని సీట్ల కింద పెట్టి తెలంగాణ కు రవాణా సాగిస్తున్నారు.
ముందుగానే ప్లాన్
రైలు ద్వారా ప్రతిరోజు ఒక ముఠా బెజవాడకు వెళ్లి అక్కడ నుండి నల్ల బెల్లం, పటిక కొనుగోలు చేసి రైలులో తెస్తారు. డోర్నకల్ నుండి మహబూబాబాద్ వరకు మార్గమ మధ్యలో పలుచోట్ల ముందుగానే ఏర్పాటు చేసుకున్న పాయింట్ల వద్ద రైలు నుండి బెల్లం, పటిక బస్తాలను జాగ్రత్తగా కిందకు జారవిడుస్తారు. ముందుగానే అక్కడ ఉన్న ముఠాలోని మరికొందరు రైలు నుంచి జారిపడ్డ బెల్లం, పటిక బస్తాలను ద్విచక్ర వాహనాల ద్వారా సమీప గ్రామాల్లో గుడుంబా తయారీదారులకు నేరుగా తీసుకువెళ్లి విక్రయిస్తారు. ఈ తతంగమంతా అర్ధరాత్రి దాటిన తర్వాత సెల్ ఫోన్ సమాచారంతో ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను తెలుసుకుంటూ, స్థానిక పోలీసులకు పట్టు పడకుండా గుట్టుగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేక ముఠా?
ఆంధ్ర నుండి తెలంగాణకు నల్లబెల్లం, పటిక రవాణాకు ప్రత్యేకంగా ఒక ముఠా ఏర్పడినట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్రాలో బెల్లం కొనుగోలు చేసి విజయవాడ స్టేషన్ వరకు చేర్చడం కోసం ఒక ముఠా, అక్కడనుండి రైలు ద్వారా మహబూబాబాద్ వరకు రవాణా చేయడానికి ఇంకొక ముఠా, రైలు నుంచి జారవిడిసిన బెల్లం, పటిక బస్తాలను గుడుంబా తయారీదారులకు చేరవేయడానికి మరొక ముఠా పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ ముఠాలో పురుషులతో పాటు స్త్రీలు కూడా భాగస్వాములు కావడం విమర్శలకు తావిస్తోంది. బెల్లం, పటిక అక్రమ రవాణా దందా కోసం పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకొని, యదేచ్చగా పుష్పుల్ రైలు ద్వారా ప్రతిరోజు నల్ల బెల్లం, పటిక రవాణా సాగిస్తున్నట్లు చెబుతున్నారు. డోర్నకల్ దాటిన తర్వాత రైలులో వీరు చేసే హడావిడి చూసి ఇతర ప్రయాణికులు జంకుతున్నారు.
రాత్రిపూట రైల్లో డోర్నకల్ నుంచి కాజీపేట వరకు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం, వీరి హడావుడి ఎక్కువగా ఉండటంతో తమ కళ్లెదుటే బెల్లం, పటిక రవాణా దందా సాగుతున్నప్పటికీ ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు చెబుతున్నారు. రాత్రిపూట రైలు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిన ఈ వ్యవహారాన్ని రైల్వే అధికారులు, జీ ఆర్ పీ, ఆర్ పీ ఎఫ్ పోలీసులు కట్టడి చేయాలని కోరుతున్నారు.