ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇద్దరు నోడల్ అధికారులు
- హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అధికారిని నియమించాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆదిలాబాద్(Adilabad)లోని సివిల్, రక్షణ(Civil, Defence) అవసరాల కోసం ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్(Air Force Training Center), జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్(Joint Use Airfield) (జేయూఏ) నిర్మాణానికి కేంద్రం ఇద్దరు నోడల్ అధికారులను(Nodal officers) నియమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో పురోగతి సాధించేందుకు నోడల్ అధికారులను నియమించాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర రక్షణ, పౌరవిమానయాన మంత్రిత్వశాఖలు ఒక్కో నోడల్ అధికారిని నియమించాయి.
దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఒక ముఖ్యమైన పురోగతిని పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ, పౌర విమానయాన శాఖ(Ministry of Defence and Civil Aviation)లతో తాను జరిపిన చర్చలు, చేసిన ప్రయత్నాల ఫలితంగా నోడల్ అధికారులను నియమించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని శాఖలు, భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం మరింత సులభంగా జరిగి, పనులు వేగవంతం కావడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆయన కోరారు.