యూరియా కోసం రైతుల నిరీక్షణ.. బుకింగ్‌లో గందరగోళం

21-09-2026 | 05:25am

యాప్ చుట్టూ యూరియా పంచాయితీ

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి) : తిరుమలాయపాలెం మండలం(Tirumalayapalem Mandal)లో యూరియా(Urea) కోసం రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మండుటెండలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుండగా, మరోవైపు యూరియా పొందేందుకు యాప్లో నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. యాప్లో బుకింగ్ ప్రక్రియ(Booking process app) అందరికీ ఒకే విధంగా అందుబాటులో లేకపోవడం, సాంకేతిక సమస్యలు(Technical issues), సమాచారం సకాలంలో అందకపోవడం వల్ల సాధారణ రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూరియా నిల్వలు వచ్చినప్పుడు ముందుగా సమాచారం తెలిసిన కొందరు రైతులు మాత్రమే యాప్లో బుకింగ్ చేసుకోగలుగుతున్నారని, సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న రైతులు బుకింగ్ చేసుకునేలోపే యూరియా అయిపోతోందని రైతులు చెబుతున్నారు. దీంతో యూరియా కోసం రైతులు ఒకవైపు క్యూలో నిలబడుతూనే మరోవైపు తమ మొబైల్ ఫోన్లలో యాప్ను చూస్తూ బుకింగ్ కోసం ప్రయత్నించాల్సి వస్తోందని వాపోతున్నారు.

యాప్ చుట్టూ యూరియా పంచాయితీ

యాప్లో యూరియా బుకింగ్, సమాచారం చేరవేత విషయంలో కొందరు ఉద్యోగుల తీరుపై కూడా రైతులు విమర్శలు చేస్తున్నారు. యూరియా అందుబాటులోకి వచ్చిన సమయం, బుకింగ్ వివరాలు అందరికీ సమానంగా తెలియజేయడం లేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. కొందరికి ముందుగానే సమాచారం అందుతోందని, మరికొందరు రైతులకు సమాచారం ఆలస్యంగా చేరుతోందని చెబుతున్నారు.

అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు వాస్తవాలను పరిశీలించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు.సంబంధిత ఉద్యోగులు రైతులకు సహకరించాల్సింది పోయి బుకింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. యాప్ ఎలా ఉపయోగించాలి, బుకింగ్ ఎలా చేసుకోవాలి, బుకింగ్ అనంతరం ఎక్కడికి రావాలి అనే విషయాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

ఇతరుల పేర్లపై యూరియా బుకింగ్?

కొంతమంది ఇతర రైతుల పేర్లను ఉపయోగించి పెద్ద సంఖ్యలో యూరియా కట్టలను నమోదు చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బుకింగ్ చేసిన యూరియాను ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. నిజంగా సాగు చేస్తున్న రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందకుండా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. యాప్లో నమోదైన రైతుల వివరాలు, ఆధార్ ధ్రువీకరణ, ఎన్ని కట్టలు పొందారు, ఎప్పుడు పొందారు అనే వివరాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. ఇతరుల పేర్లపై బుకింగ్లు జరిగితే వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బుకింగ్ చేసిన రైతుకే యూరియా ఇవ్వాలి

యాప్లో ఎవరి పేరుతో బుకింగ్ జరిగిందో ఆ రైతే స్వయంగా ఆధార్ కార్డుతో వచ్చి యూరియా తీసుకునే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఒకరి పేరుతో మరొకరు యూరియా తీసుకెళ్లకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని చెబుతున్నారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులకు స్పష్టమైన సమాచారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ అవసరం

యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. యాప్లో బుకింగ్ ప్రక్రియ నుంచి యూరియా పంపిణీ వరకు ప్రతి దశలో పారదర్శకత ఉండేలా పర్యవేక్షణ చేయాలని అంటున్నారు. యాప్లో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించడంతో పాటు, యాప్ను ఉపయోగించలేని రైతులకు ప్రత్యామ్నాయ సహాయం అందించాలని కోరుతున్నారు.

అధికారుల వివరణ

ఈ విషయంపై వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. యాప్లో నమోదు చేసుకున్న రైతులకు వారి ఆధార్ కార్డు ఆధారంగా మాత్రమే యూరియా అందిస్తున్నామని తెలిపారు. ఒక్కో రైతుకు 10 కట్టలు ఇవ్వడం లేదని, యాప్లో బుక్ చేసుకున్న రైతు స్వయంగా ఆధార్ కార్డుతో వస్తేనే యూరియా అందజేస్తామని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రైతుల నుంచి వస్తున్న ఆరోపణలు, ఉద్యోగులపై ఉన్న విమర్శలు

ఇతరుల పేర్లపై యూరియా బుకింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని రైతులు కోరుతున్నారు. నిజమైన రైతులకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు