కుబీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

12-10-2026 | 11:44pm

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal district) కుభీర్ మండల కేంద్రంలోని నాగేష్ పత్తి మిల్లు(Nagesh Cotton Mill)లో మంగళవారం పత్తి కొనుగోళ్లకు వ్యాపారులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మిల్లులో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పత్తి కొనుగోళ్లను(Cotton Purchases) లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పత్తిని తీసుకువచ్చిన వాహనాలకు, పత్తి తూకం వేసే యంత్రాలకు పూజలు నిర్వహించి, ఈ పత్తి కొనుగోళ్ల సీజన్ రైతులకు, వ్యాపారులకు లాభదాయకంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పత్తి విక్రయించేందుకు మిల్లుకు వచ్చిన పలువురు రైతులను వ్యాపారులు శాలువాలతో సత్కరించారు. రైతుల(Farmers)కు స్వాగతం పలుకుతూ కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించారు. ప్రారంభించారు. కొనుగోలు చేసిన పత్తికి క్వింటాల్‌కు రూ.9,100 చొప్పున ధర చెల్లించినట్లు తెలిపారు. దీంతో మిల్లులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో స్థానిక రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న కుభీర్ మండలంలోని రైతులు ప్రతి యేటా ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తుంటారు. పంట చేతికొచ్చిన అనంతరం సరైన ధర లభిస్తుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో నాగేష్ పత్తి మిల్లులో కొనుగోళ్లు ప్రారంభం కావడం పత్తి రైతులకు ఉపయోగకరంగా మారింది. పత్తి నాణ్యత, తేమ శాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు ఆకాంక్షించారు.

పత్తి కొనుగోళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా మిల్లు వద్ద సందడి నెలకొంది. కార్యక్రమానికి వచ్చిన రైతులు, వ్యాపారులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మిల్లు  నిర్వాహకులు రెడ్డిశెట్టి సంతోష్, ఆనంద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, ఏ ఎం సి కార్యదర్శి, పీఏసీఎస్ సీఈఓ ఎగ్గం క్రాంతికుమార్,  మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు తోకల మారుతి, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు