దూది రైతు దుఃఖం

12-10-2026 | 05:30am
  1. నిర్మల్ జిల్లాలో ఎండిపోతున్న పత్తి చేలు 
  2. తీవ్ర వర్షాభావ పరిస్థితిలే కారణం 
  3. పంటను కాపాడుకోవడానికి రైతుల పాట్లు 

నిర్మల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల(El Niño conditions) నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో పత్తి రైతులపై(Nirmal Cotton Farmers) తీవ్ర ప్రభావం చూపుతోంది. పత్తి పంట చేతికి వచ్చే దశలో వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఎండలు, భూమిలో తేమశాతం పడిపోవడంతో పత్తి మొక్కలు వాడిపోయి ఆకులు రాలిపోతున్నాయి. నెల రోజుల క్రితం పూత, కాత విరివిగా ఉండటంతో తమకు కలిసి వస్తుందని రైతులు ఆశలు పెంచుకున్నారు.

నిర్మల్ జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకాగా, పత్తి పంట 1.70 లక్షల ఎకరాల వరకు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. జూన్, జూలై నెలల్లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు జిల్లాలోని రైతులు పత్తి పంటలు సాగు చేశారు. ముధోల్, బాసర, కుంటాల, లోకేశ్వరం, తానూర్, సారంగాపూర్, మామడ లక్ష్మి, చందా నరసాపూర్, దిల్వార్పూర్, పెంబి భైంసా మండలాల్లో ఎక్కువగా పత్తి పంటను సాగు చేశారు. 

ఎదిగిన పంట ఎండు ముఖం 

పత్తి పంట ఎక్కువగా పెరిగి పూత, కాత దశలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూమిలో తేమ కరువై ఎండిపోతున్నది. జూన్ జూలై ఆగస్టు మాసాల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 30% వర్షపాతం లోటు కురిసింది. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో అసలు వర్షాలు కురవలేదు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొద్దిపాటి వర్షాలు కురిసేవి.

దీనికి తోడు వాతావరణం కూడా చల్లగా ఉండేది. మంచు పడేది. దీంతో పత్తి పంటకు ఈ వాతావరణం అనుకూలంగా ఉండటంతో రెండోసారి పంట కాపు వచ్చేది. కానీ ఈ సంవత్సరం పూర్తి విభిన్నంగా ఉన్నట్టు రైతులు తెలిపారు. ఇప్పటికి ఎకరం పత్తికి పెట్టుబడి రూపేనా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు.

ప్రస్తుతం పత్తి మొక్క కు భూమిలో తడి తేమ లేకపోవడంతో అవి వాడిపోయి ఆకులు , పూత నకిరే రాలిపోతున్నట్టు రైతులు తెలిపారు. బోర్లు ఉన్న రైతులు పత్తి పంటకు నీటి తడులను అందిస్తున్నారు. బోరు మోటర్లు ఉన్న రైతులు ప్రస్తుతం ఉన్న పంటను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో పైప్ లైన్లు వేసి నీటి తడులను అందిస్తున్నారు.   

భూగర్భ జిల్లాలు తగ్గడం, కరెంటు సరఫరాలో అంతరాయంతో పంటలకు సాగు నీరు అందించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు ఒక ఎకరం రెండు ఎకరాలకు పరిమితం చేసుకొని ఉన్న నీటిని పొదుపుగా పంటలకు వినియోగించుకుంటున్నారు. 


మరిన్ని వార్తలు