కందకుర్తి, యంచ పుష్కర ఘాట్లపై ప్రత్యేక దృష్టి
గడువులోగా పనులు పూర్తి చేయాలి.. నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): గోదావరి పుష్కరాలకు(Godavari Pushkaram) వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కందకుర్తి, యంచ పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు.
నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయడంతో పాటు నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. మంగళవారం అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి రెంజల్ మండలం కందకుర్తి, నవీపేట మండలం యంచలో పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కందకుర్తి పనులు త్వరగా పూర్తి చేయాలి
గోదావరి, మంజీర, హరిద్ర నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రమైన కందకుర్తిలో పుష్కర ఘాట్ నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నీటిపారుదల శాఖకు సంబంధించిన కొన్ని పనుల్లో జాప్యం జరుగుతోందని అధికారులు వివరించారు.
నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల పురోగతిని బోధన్ ఆర్డీఓ, సంబంధిత తహసీల్దార్లు వారానికి కనీసం రెండుసార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. పుష్కర ఘాట్లకు చేరుకునే రహదారులు, కల్వర్టుల నిర్మాణాలను ఇతర అభివృద్ధి పనులతో సమన్వయం చేసుకుంటూ చేపట్టాలని పేర్కొన్నారు.
భద్రతకు అధిక ప్రాధాన్యం
నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పోలీసుల పెట్రోలింగ్‌తో పాటు గ్రామ పాలన అధికారులు, లష్కర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పనుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
యంచలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు
నవీపేట మండలం యంచలో ఏర్పాటు చేయనున్న పుష్కర ఘాట్, పార్కింగ్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, వాహనాల పార్కింగ్‌తో పాటు దుస్తులు మార్చుకునే గదులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
పిండ ప్రదానం, కేశఖండన కార్యక్రమాల కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని, పుష్కరాలకు వచ్చే భక్తులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ పర్యటనలో బోధన్ ఆర్డీఓ విజయకుమారి, తహసీల్దార్లు శ్రవణ్, వెంకటరమణతో పాటు దేవాదాయ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.