అనుమతి లేని కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
బోధన్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): ఉట్పల్లి మాజీ కో-ఆప్షన్ సభ్యుడు(Former co-opted member) దియావత్ సంతోష్ కుమార్ ఫిర్యాదు మేరకు జిల్లా ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలతో బోధన్ మండలంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.
మండల పరిధిలో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న సుమారు ఏడు కల్లు దుకాణాలపై అధికారులు దాడులు చేసి, వాటిని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా కల్లు దుకాణాలు నిర్వహించే నిర్వాహకులతో పాటు, వారికి కల్లు సరఫరా చేస్తున్న కల్లు గీత లైసెన్సుదారులపై కూడా నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
కల్లు దుకాణాల నిర్వహణపై నేరుగా జిల్లా ఎక్సైజ్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు దియావత్ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.