ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర ప్రమాదం
తండ్రి, కూతురు స్పాట్ డెడ్
వారం రోజుల్లో కూతురు పెళ్లి
మైలార్‌దేవ్ పల్లి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ ఎక్స్-రోడ్(Aramghar X-Road) సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ బైకును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మరణించారు. కుమార్తెకు పెళ్లి కుదరండంతో సామాగ్రి కోసం తండ్రి, కూతురు బయటకు వెళ్లారు.
సామాను తీసుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కూతురు బురుషాన్ బేగంగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మరో వారంలో కూతురు పెళ్లితో పండగ వాతావరణం ఏర్పడాల్సిన ఇంట్లో ఈ మరణ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.