ఐదు కోట్ల కరెన్సీతో మెరిసిన శ్రీ అమ్మవారు
నవీపేట్, అక్టోబర్ 17 (విజయ క్రాంతి) : నవీపేట్ మండలం(Navipet Mandal) తడగాం గ్రామంలో కొలువుదీరిన శ్రీ సర్వమంగళి దేవి(Sri Sarvamangali Devi) అమ్మవారిని మహాలక్ష్మి దేవి అవతారంలో అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఏకంగా రూ.55,55,555 నగదుతో ప్రత్యేక అలంకరణ(Special decoration) చేపట్టడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అమ్మవారిని వివిధ రకాల పూలు, అలంకరణ సామగ్రితో సుందరంగా తీర్చిదిద్ది, నగదుతో చేసిన ప్రత్యేక అలంకరణను భక్తుల(devotees) దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన అలంకరణను తిలకించేందుకు తడగాంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, గ్రామంలో సిరిసంపదలు వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని శ్రీ సర్వమంగళి దేవి అమ్మవారిని ప్రార్థించారు.
అమ్మవారి ప్రత్యేక అలంకరణతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. నగదుతో చేసిన మహాలక్ష్మి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.