అగ్ని జ్వాలల్లో గణనాథుడి ఆకృతి.. భక్తులలో భక్తి పారవశ్యం
బాన్సువాడ, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ ఆదర్శ కాలనీలోని బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక యజ్ఞ కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. యజ్ఞ హోమం కొనసాగుతున్న సమయంలో అగ్ని జ్వాలల్లో వినాయకుడి రూపాన్ని పోలిన ఆకృతి కనిపించడంతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.హోమాగ్ని జ్వాలల్లో గణనాథుడి ఆకృతి కనిపించిన దృశ్యాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.
పలువురు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. దీంతో యజ్ఞ ప్రాంగణంలో కొంతసేపు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బాల గణేష్ మండప యజ్ఞంలో భాగంగా ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హోమాగ్నిలో కనిపించిన ఆకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.