పేదల ఇళ్లపై వేధింపులు ఆపాలి
అర్హులకు భూపట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి: ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు
బోధన్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, రేకుల షెడ్లు నిర్మించుకొని నివసిస్తున్న పేద ప్రజలను నోటీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం ఆపాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జిల్లా కార్యదర్శి కటారి రాములు డిమాండ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్, రెవెన్యూ భూముల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు భూపట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
నాందేవ్వాడలోని ఆర్ఎస్పీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అనేక కుటుంబాలు ఏళ్ల తరబడి ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అలాంటి నిరుపేదలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేయడం మానవత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. అర్హులైన పేదల సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో వారికి న్యాయం చేయాలని కోరారు.
భూఆక్రమణదారులపై చర్యలేవీ?
ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ప్రజా ఆస్తులను పెద్ద ఎత్తున ఆక్రమించిన భూబకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాములు ప్రశ్నించారు. భారీగా భూములను ఆక్రమించిన వారిని వదిలేసి, జీవనాధారం కోసం చిన్నచిన్న గుడిసెలు వేసుకున్న పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం వివక్షాపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి అందించాలని కోరారు. పేదల నివాస హక్కులను కాపాడటంతో పాటు, వారికి గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయకపోతే, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపడతామని కటారి రాములు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్పీ నాయకులు పిట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.