గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం

31-10-2026 | 08:42pm

100 మంది చిన్నారులకు దుస్తుల పంపిణీ

చర్ల,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju)  ఆదేశాల మేరకు, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్(DSP Arun Kumar) ఆధ్వర్యంలో చర్ల మండల పరిధిలోని చెన్నాపురం, ఎర్రంపాడు గిరిజన గ్రామాల్లో శనివారం కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని(Community connect program) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రెండు గ్రామాలకు చెందిన 100 మంది చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గ్రామాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమైన సమయంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. 

అనంతరం చిన్నారుల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని, వారికి మెరుగైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సై నర్సిరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు