అవయవదానం చేసిన సాంబయ్య కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసా పత్రం
మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజును పరామర్శించి కుటుంబానికి అండగా మంత్రి
కమాన్పూర్, అక్టోబర్27(విజయ క్రాంతి) కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Kamanpur Agricultural Market Committee) చైర్మన్ వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య ఇటీవల మరణించడంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అవయవదానంతో మరణంలోనూ మరికొందరికి ప్రాణదానం
మరణానంతరం సాంబయ్య అవయవదానం చేయడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సదాశివ ఫౌండేషన్ సభ్యులు మంత్రి చేతుల మీదుగా సాంబయ్య కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అవయవదానం ద్వారా ఇతరులకు జీవించే అవకాశం కల్పించడం గొప్ప మానవతా కార్యమని పలువురు అభిప్రాయపడ్డారు.
సాంబయ్య కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం అవయవదానంపై సమాజంలో అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అవయవదానం ప్రాముఖ్యత మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.