బసంత్‌నగర్‌లో విషాదం

09-10-2026 | 05:09pm
  1. క్వారీలో గుట్ట కూలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు
  2. పరిస్థితి విషమం.. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  3. అనుమతులు లేని అక్రమ బ్లాస్టింగ్‌లే కారణమా?
  4. విచారణకు గ్రామస్థుల డిమాండ్

పెద్దపల్లి, అక్టోబర్ 09(విజయక్రాంతి) : పెద్దపల్లి జిల్లా(Peddapalli District) బసంత్‌నగర్ పరిధిలోని కన్నాల గుట్ట క్వారీలో(Kannala Gutta Quarry) శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో పనులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుట్ట కూలిపడటంతో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు(Workers seriously injured). వారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే...

బసంత్‌నగర్ పరిధిలోని కన్నాల గుట్ట క్వారీ వద్ద కార్మికులు రోజువారీ పనులు చేస్తుండగా, ఒక్కసారిగా గుట్ట పైభాగం విరిగిపడింది. ఈ ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న వేణు, శివాజీ, రాజ్‌కుమార్ అనే ముగ్గురు కార్మికులు బండరాళ్ల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన తోటి కార్మికులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి(Peddapalli Government Hospital) తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

అనుమతులు లేని బ్లాస్టింగ్‌లే కారణమా

ఈ ప్రమాదంపై స్థానికులు, గ్రామస్థులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా, కనీస రక్షణ చర్యలు పాటించకుండా ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్ పేలుళ్లు(Blasting explosions) జరపడం వల్లే గుట్ట బలహీనపడి కూలిపోయిందని ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ పనులు సాగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గతంలోనూ పలుమార్లు అక్రమ పేలుళ్లపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సమగ్ర విచారణ చేపట్టాలి స్థానికుల డిమాండ్

ముగ్గురు నిరుపేద కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చిన ఈ ఘటనపై పోలీసులు, సంబంధిత మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్వారీ నిర్వాహకులకు అనుమతులు ఉన్నాయా... భద్రతా నిబంధనలు పాటించారా...అన్న కోణంలో విచారించి, ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు