కవర్ వద్దు.. స్టీల్ బాక్సే ముద్దు.. ఉపసర్పంచ్ వినూత్న పిలుపు!
కోనరావుపేట, నవంబర్ 01 (విజయక్రాంతి): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని బావుసాయిపేట ఉపసర్పంచ్ నవీన్ పిలుపునిచ్చారు. చికెన్ సెంటర్లకు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఇంటి నుంచే స్టీల్ లేదా ఫుడ్గ్రేడ్ టిఫిన్ బాక్సులు (Food Grade Containers) తీసుకెళ్లాలని సూచించారు. వాటిలోనే చికెన్ తెచ్చుకునే అలవాటును పెంపొందించుకోవాలని కోరారు.
ప్లాస్టిక్ కవర్ల విచ్చలవిడి వినియోగం (Plastic Usage) పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడంతోపాటు వ్యర్థాల సమస్యను పెంచుతోందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు.
ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించవచ్చని అన్నారు. మార్పు కోసం ఎదురు చూడకుండా మన ఇంటి నుంచే ఆరంభించాలని, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పునర్వినియోగించుకోగల స్టీల్ బాక్సులను (Reusable Steel Boxes) ఉపయోగించాలని కోరారు.
పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని బావుసాయిపేట ఉపసర్పంచ్ నవీన్ విజ్ఞప్తి చేశారు.