సివిల్ పంచాయితీల్లో ఖాకీల అత్యుత్సాహం!

01-11-2026 | 05:55am
  1. భూ బాధితులను నిందితులుగా చేసి కేసులు
  2. అరెస్టుల కోసం ముమ్మర ప్రయత్నాలు
  3. మూడేండ్ల క్రితం చనిపోయిన వ్యక్తి కోసమూ గాలింపు!
  4. కరీంనగర్‌లో వివాదాస్పదంగా పోలీసుల తీరు
  5. కొందరు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే వ్యవహారం
  6. గతంలో సివిల్ కేసుల్లో తలదూర్చినందుకు ఓ ఎస్‌ఐపై వేటు.. మరో డీఎస్పీపై విచారణ
  7. అయినా మారని పోలీసుల వైఖరి

కరీంనగర్ క్రైమ్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా అన్నట్లు కొందరు పోలీసులు తలుచుకుంటే బాధితులు నిందితులుగా, నిందితులు బాధితులుగా మారిపోతున్నారు. ఈ వింత కరీంనగర్ కమిషనరేట్(Karimnagar Commissionerate) పరిధిలోనే సాధ్యమవుతున్నది. సివిల్ తగాదాల్లోనూ పోలీసులు తలదూరుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 4 నెలల క్రితం నమోదైన కేసులో నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు.. ఆ నిందితులు ఇప్పుడు తాము బాధితులమంటూ కేసు పెడితే మాత్రం అప్పటి బాధితులను (నేటి నిందితులు) అరె స్ట్ చేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తున్నట్లు కిందిస్థాయి అధికారులు అనుకుంటున్నారు. 

బాధితులే నిందితులుగా..!

కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్‌లోని సర్వే నంబర్ 836, 837లో భూమి చాలా ఏండ్ల కింద పట్టాదారులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. అందులో ప్లాట్లు కొన్నవారు చాలా వరకు ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అయితే అక్కడ ఖాళీ స్థలా లు ఎక్కువగా ఉండటంతో కొందరి కన్ను పడింది.

ప్లాట్లు చేసిన పట్టా స్థలాన్ని అనుకొని ఖాళీ స్థలాలు ఉండటంతో పక్కా వ్యూ హం రచించిన ఆ కొందరు.. వాటిని పక్క ప్లాట్ల సర్వే నెంబర్ భూమిగా చూపించి అ మ్మేశారు. దీంతో ఇది కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నది. తమ భూమి ని అక్రమంగా అమ్మేశారంటూ బాధితులు నాలుగు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు పోలీసులు పట్టించుకోలేద న్న విమర్శలు ఉన్నాయి. పైగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు సివిల్ తగాదాల్లో తమను అరెస్టు చేయొద్దంటూ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు.

నాలుగు నెలల క్రితం కేసులోని నిందితులే.. ఇప్పుడు తమ భూమి నే అక్రమంగా అమ్మేశారంటూ నాటి బాధితులపై కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నాటి బాధితులను నేడు నిందితులుగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడేండ్ల కింద చనిపోయిన వ్యక్తిని సైతం నిందితుడిగా చేర్చారు. సివిల్ తగాదాల్లో అరెస్ట్ చే యొద్దనే కోర్టు ఆర్డర్ ప్రస్తుత కేసులోని వారి కి కూడా వర్తిస్తుందనే విషయాన్ని పోలీసులు మరిచిపోయి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

మితిమీరుతున్న జోక్యం..!

శాంతి భద్రతలతోపాటు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్న కరీంనగర్ పోలీసులు ఆ పేరుతో సివిల్ తగాదాల్లో నూ జోక్యం చేసుకుంటు న్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్ప టికే ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకు న్నందుకు ఉమ్మడి జిల్లా లో ఒక ఎస్‌ఐ సస్పెండ్ కాగా, డీఎస్పీ స్థాయి అధికారులపై ఎంక్వయిరీ నడుస్తున్నది. అయినా.. పోలీసుల జోక్యం మాత్రం ఆగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే ఇందుకు ఉదాహరణ. సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం ఉండరాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశా లు ఉన్నాకానీ ఇక్కడి పోలీసులు ఖాతరు చే యడం లేదని బాధితులు అంటున్నారు.

సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం వెనుక ఉన్నతాధికారుల ఒత్తిడి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ కోతిరాంపూర్ సర్వే నంబర్ 836, 837లో జరుగుతున్న భూ తగాదాల విషయంలో పోలీసు శాఖకు చెందిన ఒకరిద్దరు ఉన్నతస్థాయి అధికారులే వెనకనుంచి నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.  అయితే..  కొందరు పోలీసులు మాత్రం, ఉన్నతాధికారుల ఆదేశాలు అమ లు చేయకపోతే తమ ఉద్యోగం పోతుందన్న కారణం గానే తలదూర్చాల్సి వస్తుందని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు పోలీస్ వర్గా ల్లో వినిపిస్తున్నది. 

ప్రతి విషయంలో జోక్యం పెరుగుతున్నది

సివిల్ పంచాయితీల్లో పోలీసుల జోక్యం అనేది ఉండకూడదు. పోలీసులు శాంతి భద్రతలు రక్షించడం తోపాటు కరీంనగర్‌లో పెరుగుతున్న గంజాయి వినియోగాన్ని అరికట్టడం, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూ స్తూ సామాన్య ప్రజలకు ఆసరాగా నిలబడాల్సిన అవసరం ఉంది. అంతేకానీ కోర్టులో ఉన్న సివిల్ తగాదాల్లో తలదూర్చడం అనేది నిజంగా శోచనీయం. నిజంగా అమాయకులకు అన్యాయం జరుగుతుంటే పోలీసులు జోక్యం చేసుకున్నా పరవాలేదు.. కానీ ప్రతీ విష యంలో జోక్యం చేసుకోవడం తగ్గించుకోవాలి.

 అంబటి జోజిరెడ్డి,

స్టేట్ కన్వీనర్, ఆల్ ఇండియా

ఫార్వర్డ్ బ్లాక్

మరిన్ని వార్తలు